Share News

ఈ ఏడాదీ 66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:01 AM

కృష్ణానదీ జల వివాద ట్రైబ్యునల్‌-2 తుది తీర్పు వచ్చేదాకా ఆ నదీ జలాల్లో ఏపీ, తెలంగాణకు పాత నిష్పత్తి మేరకే కేటాయింపులు చేస్తామని కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.

ఈ ఏడాదీ 66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాలు

  • ట్రైబ్యునల్‌-2 తుది తీర్పు వచ్చేదాకా గతం మాదిరే పంపిణీ

  • 30న హైదరాబాద్‌లో కేఆర్‌ఎంబీ సమావేశం

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కృష్ణానదీ జల వివాద ట్రైబ్యునల్‌-2 తుది తీర్పు వచ్చేదాకా ఆ నదీ జలాల్లో ఏపీ, తెలంగాణకు పాత నిష్పత్తి మేరకే కేటాయింపులు చేస్తామని కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. ఈనెల 30న హైదరాబాద్‌ జలసౌధలో కేఆర్‌ఎంబీ చైర్మన్‌ సుబ్రంగ్షు బిశ్వాస్‌ అధ్యక్షతన కృష్ణానదీ యాజమాన్య సంస్థ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అజెండాను గురువారం రెండు రాష్ట్రాలకూ పంపించింది. ఈ ఏడాది(2026-27)లోనూ కృష్ణానదీ జలాలను 66:34 నిష్పత్తిలో పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. ట్రైబ్యునల్‌-2 తుది తీర్పు రానందున ట్రైబ్యునల్‌-1 ఆదేశాలను, రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నీటి పంపకాలు ఉంటాయని పేర్కొంది. కృష్ణా జలాల్లో తమకు 71 శాతం వాటా ఉండాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని, అయినా కేడబ్ల్యూడిటీ-1 ఆదేశాలను అమలు చేస్తామని తేల్చిచెప్పింది. 2025-26లో ఏపీ 594.097 టీఎంసీలు, తెలంగాణ 142.267 టీఎంసీలు వాడుకున్నాయని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో కేటాయించినట్లుగా కార్యాలయాన్ని కేటాయిస్తే త్వరలోనే విజయవాడకు కేఆర్‌ఎంబీని తరలిస్తామని తెలిపింది. పోలవరం-నల్లమలసాగర్‌పైనా ఈ సమావేశంలో ఒక అజెండా అంశంగా ఉంటుందని వెల్లడించింది. పోలవరం-బనకచర్ల ప్రీఫీజబిలిటీ రిపోర్టును అనుసరించి.. డీపీఆర్‌ను తయారు చేసేందుకు పిలిచిన టెండర్లను ఏపీ ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. పోలవరం-నల్లమలసాగర్‌ అనుసంధాన పథకం డీపీఆర్‌ తయారు తదితర అంశాలపైనా చర్చిస్తామని పేర్కొంది. శ్రీశైలం జలాశయం ప్లంజ్‌పూల్‌ మరమ్మతు పనులు అత్యవసరంగా చేపట్టే అంశాన్నీ అజెండాలో చేర్చింది. డ్యామ్‌ రిహేబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు - డీఆర్‌ఐపీ కింద రూ. 15 కోట్లతో ప్లంజ్‌పూల్‌ మరమ్మతు పనులకు సీడబ్ల్యుపీఆర్‌ఎ్‌స-పుణె సిద్ధమైనట్లు వెల్లడించింది. కృష్ణా నదిపై ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందన్న తెలంగాణ వాదనలపైనా చర్చ జరుగుతుందని స్పష్టం చేసింది. కేఆర్‌ఎంబీ కోసం ఒక విజిలెన్స్‌ అధికారి, సోషల్‌ మీడియా నిర్వహణకు అవుట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగిని నియమించుకుంటామని వెల్లడించింది.

Updated Date - Apr 24 , 2026 | 05:01 AM