22 నుంచి బ్రిజేశ్ ట్రైబ్యునల్ విచారణ
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:56 AM
కృష్ణా జలాలపై తెలంగాణ అభ్యంతరాలు.. చెబుతున్న నీటి లెక్కలపై ఈ నెల 22 నుంచి జరిగే బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ విచారణలో వాదనలు వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది.
విజయవాడ చేరుకున్న సీనియర్ న్యాయవాదులు
గుప్తా బృందం వాదనలపై ముఖ్యమంత్రి సంతృప్తి
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలపై తెలంగాణ అభ్యంతరాలు.. చెబుతున్న నీటి లెక్కలపై ఈ నెల 22 నుంచి జరిగే బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ విచారణలో వాదనలు వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు జైదీప్ గుప్తా, ఉమాపతి నేతృత్వంలోని న్యాయవాదుల బృందం ఆదివారం విజయవాడ వచ్చింది. వీరు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇప్పటికే ట్రైబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వినిపించిన వాదనలు.. తెలంగాణ అభ్యంతరాలను మరోసారి అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం ఇంజనీర్లతో సమీక్షించనున్నారు. ఈ అంశంలో సలహాదారు గంగాధర్ సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. గుప్తా బృందం సీఎం చంద్రబాబును కూడా కలవాలని భావిస్తోంది. ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తే.. ఇప్పటిదాకా జరిగిన విచారణ సారాంశాన్ని వివరించి.. మున్ముందు వినిపించాల్సిన వాదనలపై స్పష్టత తీసుకోవాలని అనుకుంటోంది. గుప్తా బృందం వాదనలపై సీఎం కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇటీవల తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ, కర్ణాటక, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, డీకే శివకుమార్, రేవంత్‌రెడ్డి, కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు మధ్య కృష్ణా జలాలపై చర్చలు జరిగిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రిని, ఉన్నతాధికారులను కలిసి తదుపరి వాదనలపై తగు ఆదేశాలు తీసుకోవాలని నిర్ణయించుకుని విజయవాడకు వచ్చింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ వేసిన పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టు ముందుకు రాలేదు. దీనిపై కౌంటర్ వేసేందుకు ఏపీ జల వనరుల శాఖ సమాయత్తమవుతోంది. ఈ అంశంపైనా గుప్తా బృందంతో ఉన్నతాధికారులు చర్చించనున్నట్లు జల వనరుల శాఖ వర్గాలు తెలిపాయి.
అంతర్రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ ఎవరో..!
జల వనరుల శాఖ అంతర్రాష్ట్ర జల వివాదాల విభాగం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న సుగుణాకరరావు జూన్ నెలాఖరులో పదవీ విరమణ చేశారు. సూపరింటెండింగ్ ఇంజనీర్లుగా ఉన్న గిరిధర్, రాధాకృష్ణ, రాజేశ్వరిల్లో ఎవరికి ఈ బాధ్యతలు బాధ్యతలు అప్పగించనున్నారన్న చర్చ జరుగుతోంది. గిరిధర్‌కు ఇంకో 60 రోజుల సర్వీసు మాత్రమే ఉంది. రాధాకృష్ణకు ఏడాది పాటు ఉండగా.. రాజేశ్వరికి ఎక్కువ కాలం సర్వీసు ఉంది. ఈ శాఖలో అంతర్రాష్ట్ర జలవివాదాల విభాగం బాధ్యతలు తీసుకోవాలంటే ఇంజనీరింగ్ అధికారులెవరూ ఆసక్తి చూపరు. కీలక సమయంలో ఈ ముగ్గురు మాత్రం సుముఖంగా ఉన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.