Share News

విహారం మిగిల్చిన విషాదం

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:37 AM

వారంతా వేసవి సెలవులకు తాతయ్య ఇంటికి వచ్చారు. సరదాగా గడిపారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో.. చివరిసారిగా కృష్ణా నదిలో విహార యాత్ర చేయాలని ఆశపడ్డారు.

విహారం మిగిల్చిన విషాదం

  • కృష్ణాలో పడవ మునిగి నలుగురు మృతి

  • మృతులంతా ఒకే కుటుంబంలో వారే

  • పల్నాడు జిల్లా కోనూరు వద్ద దుర్ఘటన

అచ్చంపేట, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): వారంతా వేసవి సెలవులకు తాతయ్య ఇంటికి వచ్చారు. సరదాగా గడిపారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో.. చివరిసారిగా కృష్ణా నదిలో విహార యాత్ర చేయాలని ఆశపడ్డారు. దీంతో ఆ పిల్లల మేనమావ వారిని ఒక చిన్న పడవ ఎక్కించి నదిలోకి తీసుకెళ్లాడు. వారంతా ఆనందంతో కేరింతలు కొడుతుండగా.. ఉన్నట్టుండి పడవ మునిగి పోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది. కోనూరులోని గంధం గంగయ్య వేసవి సెలవులకు తన మనవళ్లు, మనవరాళ్లను పిలిపించుకున్నారు. రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెంకు చెందిన గంగయ్య కుమార్తె బత్తుల అరుణ కుమారుడు కార్తీక్‌ (14), చిలకలూరిపేటకు చెందిన మరో కుమార్తె కొణతం పూర్ణ కుమారి కుమారుడు చైతన్య (20) గంగయ్య కుమారుడైన గంధం సత్యానందం కుమార్తె షైనీ (11), చిన్న కుమార్తె సంధ్య (9) సెలవులకు కోనూరు వచ్చారు. సోమవారం నుంచి పాఠశాలలకు వెళ్లాల్సి ఉండడంతో వారంతా ఒకసారి కృష్ణా నదిలో పడవ ప్రయాణం చేయాలని ఆశపడ్డారు. దీంతో గంగయ్య కుమారుడు సత్యానందం పది మందిని తీసుకుని చిన్న పడవలో నదిలోకి వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక పడవ ఒక పక్కకు ఒరిగి నీటిలో మునిగిపోయింది. దీంతో అందులో ఉన్నవారంతా నీట మునిగారు. సత్యానందం, మరో ఇద్దరు కలిసి ఆరుగురిని రక్షించారు. మరో నలుగురు నీటిలో గల్లంతయ్యారు. పోలీసులు గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టగా.. కార్తీక్‌, షైనీ, సంధ్య, చైతన్య మృతదేహాలు లభించాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను సత్తెనపల్లిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.


  • సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

నరసరావుపేట రూరల్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న ఆయన, ఈ ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి... ఆ మొత్తాన్ని తక్షణమే అందజేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్‌ శాఖలతో కూడిన బృందంతో పూర్తి స్థాయి విచారణ చేపట్టి, నివేదిక సమర్పించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Jun 15 , 2026 | 04:40 AM