Share News

కృష్ణాకు 17 టీఎంసీల గోదారమ్మ నీరు

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:53 AM

కృష్ణాలో కలిసిన గోదావరి నీటి పరవళ్లను సీఎం చంద్రబాబు ఆదివారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పరిశీలించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు వస్తున్న..

కృష్ణాకు 17 టీఎంసీల గోదారమ్మ నీరు

  • ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్‌ ఆపి పరిశీలించిన సీఎం.. ఎల్‌నినో వేళ ‘పట్టిసీమ’తో పంటలకు జీవం

  • సమర్థ నీటి నిర్వహణతో సాగునీటి ఇబ్బందులు .. లేకుండా చూడాలని అధికారులకు సూచన

విజయవాడ/తాడేపల్లి టౌన్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): కృష్ణాలో కలిసిన గోదావరి నీటి పరవళ్లను సీఎం చంద్రబాబు ఆదివారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పరిశీలించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు వస్తున్న గోదావరి నీటిని తిలకించారు. ఆదివాసి దినోత్సవంలో పాల్గొని తిరిగి ఉండవల్లి నివాసానికి వెళ్తున్న సమయంలో సీఎం బ్యారేజీపై కాన్వాయ్‌ను నిలిపారు. గోదావరి నీటి రాకతో నిండుకుండలా ఉన్న బ్యారేజీని, బంగారు రంగులోకి మారిన కృష్ణానీటిని కొంతసేపు పరిశీలించారు. కృష్ణాలో గోదావరి పరవళ్లపై చంద్రబాబు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఈ సీజన్‌లో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు విజయవంతంగా తరలించామని పేర్కొన్నారు. కృష్ణా డెల్టాలోని తూర్పు, పశ్చిమ ప్రధాన కాల్వలు, గుంటూరు చానల్‌ ద్వారా మొత్తం 7,158 క్యూసెక్కుల నీటిని సాగు కోసం విడుదల చేస్తున్నామని తెలిపారు. ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తుందన్నారు. సమర్థ నీటినిర్వహణ ద్వారా సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు పనిచేయాలని అధికారులకు సూచించారు.

Updated Date - Aug 10 , 2026 | 03:55 AM