చంపి.. మృతదేహాలను బైక్‌కు కట్టేసి!
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:54 AM
చేపల వేటకు వెళ్లిన వ్యక్తులు విగతజీవులుగా కనిపించారు! ఇద్దరు మామాఅల్లుళ్ల మృతదేహాలు ఓ బైక్‌కు తాళ్లతో కట్టేసిన స్థితిలో ఉప్పుటేరులో శవాలై తేలాయి.
ఉప్పుటేరులో శవాలై తేలిన మామా అల్లుళ్లు
కృష్ణా జిల్లాలో జంట హత్యల కలకలం
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
కృత్తివెన్ను, జూన్ 29(ఆంధ్రజ్యోతి): చేపల వేటకు వెళ్లిన వ్యక్తులు విగతజీవులుగా కనిపించారు! ఇద్దరు మామాఅల్లుళ్ల మృతదేహాలు ఓ బైక్‌కు తాళ్లతో కట్టేసిన స్థితిలో ఉప్పుటేరులో శవాలై తేలాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో కలకలం రేపింది. మృతదేహాలు బైక్‌కు కట్టేసి, ఉప్పుటేరులో పడేయడాన్ని చూస్తే.. పథకం ప్రకారం ఈ జంట హత్యలు జరిగాయని భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. చినగొల్లపాలెంలోని యానాది వర్గానికి చెందిన శెట్టి సుబ్బన్న (49), ఆయన చిన్న అల్లుడు గొలుసు అయ్యప్ప (26) రోజు మాదిరిగానే ఈ నెల 27వ తేదీ శనివారం రాత్రి ఉప్పుటేరులో చేపల వేటకు వెళ్లారు. ఆదివారం ఉదయం వారిద్దరు ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా, ఎంతకీ రాలేదు. దీంతో కుటుంబసభ్యులు అందోళనతో వారి ఆచూకీ కోసం గాలించారు. ఫలితం లేకపోవటంతో సుబ్బన్న కుమారుడు ఏడుకొండలు ఆదివారం రాత్రి కృత్తివెన్ను పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సోమవారం ఉదయం కాలువ వద్ద, గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో ఉప్పుటేరులో ఒక మనిషి చెయ్యి పైకి లేచి ఉండటాన్ని గమనించారు. గజ ఈతగాళ్లు, పడవల సాయంతో మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చారు. రెండు మృతదేహాలను ఓ బైక్‌కు తాళ్లతో కట్టి ఉండటాన్ని చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. సుబ్బన్న, అయ్యప్పను ఎవరో చంపేసి, మృతదేహాలను కనిపించకుండా చేసేందుకు తాళ్లతో వాళ్ల బైక్‌కే కట్టేసి.. లోతుగా ఉండే ఉప్పుటేరులో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, డీఎస్పీలు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ జంట హత్యలతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలాంటి చెడు అలవాట్లు లేని, గొడవలకు వెళ్లని సుబ్బన్న, కొడుకులా మామతో కలిసి మెలిసి ఉండే అల్లుడు అయ్యప్ప మృతితో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది.