Share News

సామాన్య భక్తులకే పెద్దపీట

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:42 AM

మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల 15న జరగనున్న తిరునాళ్లలో స్వామి దర్శనానికి సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని, ఎక్కువ మంది...

సామాన్య భక్తులకే పెద్దపీట

  • కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

కోటప్పకొండ(నరసరావుపేట), ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల 15న జరగనున్న తిరునాళ్లలో స్వామి దర్శనానికి సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని, ఎక్కువ మంది భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కోటప్పకొండ దేవస్ధానం ప్రాంగణంలో బుధవారం అయన తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్షించారు. ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నుంచి రూ.30 లక్షల నిధులు విడుదల చేస్తున్నామన్నారు. అన్ని శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి తిరునాళ్లను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఉచిత దర్శనం కూలైన్ల నిడివిని పెంచాలని.. పారిశుధ్యం, తాగునీరు సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని... భక్తులకు ఆరోగ్య సేవలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ భారీ విద్యుత్‌ ప్రభలు తిరునాళ్లకు వస్తాయని, విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకొవాలని ఆధికారులను ఆదేశించారు. 108 అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. సమావేశంలో చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 04:43 AM