కొల్లేరు వాసులపై ‘కొఠారు’ దాష్టీకం
ABN , Publish Date - Sep 29 , 2026 | 06:30 AM
కొల్లేరు వాసులపై ‘కొఠారు’ దాష్టీకం Kotaru Abbaiah Chowdary Misbehavior on Kolleru People
ఎగవేసిన కౌలు అడిగినందుకు కారుతో ఢీకొట్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
పెదవేగి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తాను ఎగవేసిన కౌలు అడిగారన్న కోపంతో కొల్లేరు వాసులపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి దాష్టీకానికి పాల్పడ్డారు. తన కారుకు ఎదురుగా నిరసన తెలుపుతున్న వారిపైకి కారును పోనిచ్చారు. దీంతో పలువురు గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు, కోమటిలంక గ్రామాల పరిధిలోని కొల్లేరు చేపల చెరువులను గతంలో లీజుకు తీసుకున్నారు. దీనికి సంబంధించి రూ.8 కోట్ల వరకు కౌలు బకాయి పెట్టారు. ఈ సొమ్ము ఇవ్వాలని అడిగిన పాపానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులుతో గ్రామస్థులను జైలుకు పంపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమక్షంలో జరిగిన ఒప్పందంలో కౌలు తిరిగి చెల్లించేస్తామని అబ్బయ్యచౌదరి, ఆయన తండ్రి రామచంద్రరావు అంగీకరించారు. నెలలు గడిచిపోయినా చెల్లించలేదు. సోమవారం పెదవేగి మండలం వేగివాడకు అబ్బయ్యచౌదరి రావడంతో శాంతియుతంగా నిరసన తెలపడానికి గ్రామస్థులు కూడా వచ్చారు. అబ్బయ్యచౌదరి కారు ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన కొఠారు.. వారిపైకి కారు పోనివ్వాలని డ్రైవర్‌ను ఆదేశించారు. డ్రైవర్ కారు ముందుకు పోనివ్వడంతో పలువురు గ్రామస్థులు, వారికి తోడుగా వచ్చిన టీడీపీ నేతలు గాయపడ్డారు. అబ్బయ్యచౌదరి అనుచరులు నిరసనకారులపై దాడి చేశారు. ఏలూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొల్లేరు వాసులు, టీడీపీ నాయకులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..