నేడు కోటప్పకొండ తిరునాళ్లు
ABN , Publish Date - Feb 15 , 2026 | 04:04 AM
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అంగరంగ వైభవంగా జరగనుంది.
లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
3,000 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు
100 అడుగుల ఎత్తున 22 భారీ విద్యుత్ ప్రభలు
కోటప్పకొండ(నరసరావుపేట), ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అంగరంగ వైభవంగా జరగనుంది. తిరునాళ్లకు దేశ నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది భక్తులకు ఇబ్బంది కలగకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ పట్టణాల నుంచి తిరునాళ్లకు 618 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. తాగునీరు, పారిశుధ్యం, వైద్య ఆరోగ్య అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ తిరునాళ్లనే ప్రభల పండుగగా పిలుస్తారు. తిరునాళ్లలో విద్యుత్ ప్రభలు ఆకర్షణంగా నిలుస్తాయి. 100 అడుగుల ఎత్తులో నిర్మించిన 22 భారీ విద్యుత్ ప్రభలు తిరునాళ్లలో కాంతులీననున్నాయి. శనివారం ఉదయం ఆయా గ్రామాల నుంచి ఊరేగింపుగా ప్రభలు కోటప్పకొండకు పయనమయ్యాయి. ఎనిమిది లక్షల మందికి పైగా భక్తులు వస్తారన్న అంచనా నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3000 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తుతో పాటు.. 200 సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో నిఘా ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయం ద్వారా బందోబస్తును పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. ఉచిత దర్శనం, ప్రత్యేక, శీఘ్ర, వీఐపీ దర్శనాలు, అభిషేకాల కోసం ప్రత్యేకంగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. ఈసారి వీఐపీ ఉచిత దర్శనాలను రద్దు చేశారు. కలెక్టర్ కృతికా శుక్లా ఏర్పాట్లును పరిశీలించారు. ఎస్పీ బి.కృష్ణారావు బందోబస్తును పర్యవేక్షించారు. కాగా.. ఆదివారం అర్ధరాత్రి శ్రీ త్రికోటేశ్వర స్వామికి లింగోద్భవ అభిషేకాలు వైభవంగా జరగనున్నాయి. తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా నేపథ్యంలో ప్రభుత్వం తరపున శ్రీ త్రికోటేశ్వర స్వామికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు, వెండి ప్రభను సమర్పించనున్నారు.