రాష్ట్ర పండుగగా కోనసీమ ప్రభల తీర్థం: మంత్రి దుర్గేశ్
ABN , Publish Date - Jan 09 , 2026 | 06:17 AM
కోనసీమ ప్రాంతంలో విశిష్ఠ సంప్రదాయంగా జరిగే జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు.
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): కోనసీమ ప్రాంతంలో విశిష్ఠ సంప్రదాయంగా జరిగే జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. గురువారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మకత సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. 470 ఏళ్ల చరిత్ర కలిగిన కోనసీమ ప్రభల తీర్థం తెలుగు సంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పడుతుంది. అంతర్జాతీయ గుర్తింపు పొందిన కోనసీమలో ఈ ఉత్సవాన్ని సంక్రాంతి వేళ కనుమ రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం చాలా గర్వకారణం. భవిష్యత్ తరాలకు వారసత్వాన్ని అందించేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయి’ అని మంత్రి పేర్కొన్నారు.