ఆపినట్లే ఆపి..మళ్లీ మొదలెట్టారు!
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:46 AM
ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని ఓ వైసీపీ మాజీ ఎంపీ, ఆయన ఇద్దరు అనుచరులు కోనసీమలో అక్రమ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని, వారికి జిల్లాకు చెందిన ఓ కీలక ఉన్నతాదికారి సహకరిస్తున్నారని టీడీపీ.....
కోనసీమలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిన్నటి వరకు ఆగిన ఇసుక అక్రమ తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. విచారణ సందర్భంగా ఐదారు రోజులు శాంతించిన అక్రమార్కులు.. అది కొనసాగుతుండగానే తిరిగి బరితెగించారు. ఈసారి కొత్త ప్రాంతాల్లో భారీ యంత్రాలనే గోదావరి నది పరిసరాల్లోకి తీసుకెళ్లి యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. దీనివెనుక ఉన్న ఇద్దరు వైసీపీ నేతలు నేరుగా నది ఒడ్డునే అక్రమ తవ్వకాలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికే సవాల్ విసిరారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని ఓ వైసీపీ మాజీ ఎంపీ, ఆయన ఇద్దరు అనుచరులు కోనసీమలో అక్రమ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని, వారికి జిల్లాకు చెందిన ఓ కీలక ఉన్నతాదికారి సహకరిస్తున్నారని టీడీపీ, జనసేన నేతలు స్వయంగా పలు ఆధారాలతో ప్రభుత్వానికి ఇటీవల ఫిర్యాదుచేశారు. ఇదే అంశంపై పలు ఆధారాలను సేకరించి ‘కోనసీమను కుమ్మేస్తున్నారు’ శీర్షికన మార్చి 30న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. ఈ పరిణామాలపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గనులశాఖ కాకినాడ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) జగన్నాథరాజును విచారణాధికారిగా నియమించింది. ఆయన పి.గన్నవరం, కొత్తపేట ప్రాంతాల్లో గోదావరి వెంట సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ ప్రారంభించారు. ఇదే సమయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు ప్రజల నుంచి మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. కోనసీమ జిల్లా గనుల అధికారులు ఆ ఫిర్యాదీలను పిలిచి విచారించే ప్రయత్నం చేశారు. ఇది సీఎంవో దృష్టికి రావడంతో.. జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ తవ్వకాల విచారణలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. మరోవైపు కోనసీమ కలెక్టర్ అమరావతికి వచ్చి.. సీఎం ఎక్స్‌అఫిషియో ప్రత్యేక సీఎస్ విజయానంద్‌ను కలిసి స్థానిక పరిస్థితులను వివరించి వెళ్లారు. కానీ సీఎంవోలో గనుల శాఖ వ్యవహారాలు చూసే రాజమౌళిని కలువలేదని ఆ తర్వాత అధికార వర్గాలు నిర్ధారించాయి. ఈ పరిణామంపైనే చర్చలు జరిగాయి. ప్రభుత్వ విచారణ నేపథ్యంలో ఆ ఇద్దరు వైసీపీ నేతలు వెనక్కి తగ్గారని భావించారు. అయితే వారు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తెస్తూ.. విచారణాధికారి ఇచ్చే నివేదికను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
గురువారం అనూహ్యంగా పి.గన్నవరం. జొన్నాడ, ఆత్రేయపురం, గోపాలపురం తదితర ప్రాంతాల్లో మళ్లీ అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. ఈసారి భారీ యంత్రాలు అంటే 2 టన్నుల బకెట్ బరువు ఉంటే పొక్లయిన్లను నదీ సమీపంలోకి తీసుకెళ్లి తవ్వకాలను ప్రారంభించారు. లంకల గన్నవరం, ఆచంట మండలం పెద్దమల్లంలో తవ్వకాలు ప్రారంభించారు. పెద్దఎత్తున తవ్వకాలు, లోడింగ్ చేస్తున్నారు. లారీలు, ఇతర వాహనాలు వచ్చి వెళ్లేందుకు వీలుగా రోడ్లు కూడా వేసేసుకున్నారు. అక్రమ తవ్వకాలపై విచారణే ఇంకా పూర్తికాలేదు.. ఇక ఇప్పట్లో చర్యలేం తీసుకుంటారు.. మీ పని మీరు కానివ్వండంటూ జిల్లా ఉన్నతాధికారి ఒకరు ఇచ్చిన భరోసాతోనే వైసీపీ నేతలు బరితెగించారు. నది వద్దకు వెళ్లి అక్రమ తవ్వకాలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీనిపై స్థానికులు కూటమి నేతలను అప్రమత్తం చేశారు. వారు సదరు కీలక ఉన్నతాధికారికి సమాచారం పంపినా ఆ ప్రాంతాలకు గనులశాఖ అధికారులను కాదు కదా.. పోలీసులను కూడా పంపించలేదు. దీంతో ఆ తవ్వకాలకు ఆయన మద్దతు కొనసాగుతోందని నిర్ధారణకు వచ్చిన నేతలు.. సొంతంగా వివరాలు సేకరించారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలు, అక్కడ పనిచేస్తున్న యంత్రాలు, ఆ ప్రాంతాల అక్షాంశ , రేఖాంశాలు, సమయం, ఇతర శాటిలైట్ డేటా కనిపించేలా పక్కా ఆధారాలను సేకరించి గురువారం సాయంత్రమే సీఎంవోకు నివేదించారు. అక్రమ తవ్వకాలను నిర్ధారించే ఫొటోలు, వీడియోలను కూడా ఫిర్యాదులకు జతచే శారు. వాటిని చూసి ఉన్నతాధికారులు విస్తుపోతున్నారు. ఓవైపు ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ చేస్తుంటే.. ఆ వైసీపీ నేతలు ఇప్పుడు మళ్లీ కొత్త ప్రాంతాల్లో దందా ప్రారంభించడమంటే.. ప్రభుత్వాన్ని ధిక్కరించడమేనని భావిస్తున్నారు.