కోనసీమ ఇసుక దందాపై నేడు విచారణ
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:42 AM
కోనసీమ జిల్లాలో ఇసుక అక్రమ దందాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అక్రమంగా ఏర్పాటు చేసుకున్న రీచ్‌లను గుర్తించాలని, పర్యావరణానికి జరుగుతున్న నష్టం, నదీ వాస్తవిక పరిస్థితిపై...
రీచ్‌ల తనిఖీ బాధ్యత కాకినాడ డీడీకి
విచారణకు కోనసీమ అధికారులు దూరం
అమరావతి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లాలో ఇసుక అక్రమ దందాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అక్రమంగా ఏర్పాటు చేసుకున్న రీచ్‌లను గుర్తించాలని, పర్యావరణానికి జరుగుతున్న నష్టం, నదీ వాస్తవిక పరిస్థితిపై క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేయాలని గనుల శాఖను ఆదేశించింది. ఈ బాధ్యతను గనుల శాఖ కాకినాడ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ రాజుకు అప్పగించింది. గురువారం ఉదయమే ఆయన కోనసీమ జిల్లాలోని కొత్తపేట, పి. గన్నవరం, రావులపాలెం, జొన్నాడ సహా పలు ప్రాంతాల్లో తన బృందంతో పర్యటించి విచారణ చేపట్టనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎంపీతో కోనసీమ జిల్లా కీలక ఉన్నతాధికారి కుమ్మక్కై ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన నేతలు ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపఽథ్యంలో కోనసీమ జిల్లా అధికారులను క్షేత్రస్థాయి తనిఖీలు, విచారణకు పూర్తిగా దూరంపెట్టారు. విచారణ బాధ్యతను కాకినాడ అధికారులకు అప్పగించారు. కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు 2023 ఆగస్టు 17న కోనసీమలోని ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలోని ఇసుక రీచ్‌ల వద్దకు వెళ్లారు. ఇసుక అక్రమ తవ్వకాలను ప్రస్తావిస్తూ సెల్ఫీ చాలెంజ్ విసిరారు. ఆ సమయంలో వైసీపీ నేత నాగమోహన్‌రెడ్డిపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇసుక రీచ్‌లతో ఆయనకేం పని? అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఇదే నేత జొన్నాడలో అక్రమ తవ్వకాలకు సారథ్యం వహిస్తున్నారని టీడీపీ నేతలు తాజాగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన కొత్తపేట ప్రజాప్రతినిధి ఆ వైసీపీ నేతను ముందుపెట్టి ఇసుక అక్రమ తవ్వకాలు, వ్యాపారం నిర్వహిస్తున్నారంటూ ఫొటోలు, వీడియోలతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
ఇసుక తవ్వకాలపై ఏరియల్ ఫొటోలు
కోనసీమ జిల్లాలో ఇసుక తవ్వకాలపై విచారణ చేపట్టిన సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలో గోదావరి తీరం వెంట శాటిలైట్, ఏరియల్ ఫొటోలు తెప్పించుకుంటోంది. గూగుల్ ఎర్త్, ఇతర శాటిలైట్ సాంకేతికత ఆధారంగా గోదావరి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రహదారుల ఏర్పాటు, భారీ వాహనాల రాకపోకలు, ఇంకా ఇతర కీలకమైన డేటాను అందించాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించింది. వీటి ఆధారంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు ఏ మేరకు జరిగాయో ప్రాఽథమికంగా నిర్ధారించనున్నారు. మట్టి తవ్వకాలు, రవాణా కోసం గత ఏడాదిన్నర కాలంలో ఇచ్చిన తాత్కాలిక పర్మిట్లు, వాటి ద్వారా వచ్చిన నిధులు, ఖర్చు, తదతర అంశాలపై కూడా రికార్డులు సమర్పించాలని జిల్లా అధికారులను గనుల శాఖ ఆదేశించింది.