కదిలిన యంత్రాంగం
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:39 AM
కోనసీమ జిల్లాలో ఇసుక, మట్టి దందా పై విచారణకు ప్రత్యేకాధి కారుల బృందం మందుకు కదిలింది. నాలుగు రోజులుగా జిల్లాలోని వివిధ అధికారిక..
కోనసీమలో ఇసుక, మట్టి దందాపై ప్రత్యేక అధికారుల బృందం విచారణ
‘ఆంధ్రజ్యోతి’లో కథనాలతో స్పందించిన ప్రభుత్వం
అమలాపురం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లాలో ఇసుక, మట్టి దందా పై విచారణకు ప్రత్యేకాధి కారుల బృందం మందుకు కదిలింది. నాలుగు రోజులుగా జిల్లాలోని వివిధ అధికారిక, అనధికారిక ర్యాంపుల్లో ఇసుక, మట్టి అక్రమ దందాలపై ‘కోనసీమలో కుమ్మేస్తున్నారు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాకు చెందిన మైన్స్ డీడీ పి.జగన్నాథరావు ఆధ్వర్యంలోని అధికారుల బృందం గురువారం కోనసీమ జిల్లాలోని వివిధ ర్యాంపులను పరిశీలించింది. జగన్నాథరావుతోపాటు కోనసీమ మైన్స్ అసిస్టెంట్ డైరక్టర్ బి.అశోక్‌కుమార్, ఏలూరు విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరత్నం, ఆయా మండలాల్లోని రెవెన్యూ, హెడ్‌వర్క్స్ ఇతర మైన్స్ అధికారులు ఈ బృందంలో ఉన్నారు. ఆలమూరు మండలం గౌతమి నదిలోని జొన్నాడ ఇసుక ర్యాంపు, రావులపాలెం మండలం గోపాలపురం, ఊబలంక ర్యాంపులు, కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపులను పరిశీలించారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఊడిమూడిలో మైన్స్ విజిలెన్స్ హెడ్‌వర్క్, రెవెన్యూ అధికారుల బృందం ర్యాంపులను పరిశీలించింది. అక్కడ ఏ మేరకు ఇసుక తవ్వకాలు జరిగాయో ఆరా తీసింది. స్థానిక ప్రజలతోపాటు ర్యాంపుల్లో పనిచేస్తున్న సిబ్బందితోనూ మాట్లాడి సమాచారాన్ని రాబట్టింది. కాగా, ప్రత్యేకాధికారులు తనిఖీకి వస్తున్నారని తెలిసి కొన్నిచోట్ల తవ్వకాల ఆనవాళ్లు గుర్తుపట్టకుండా జాగ్రత్తలు పడినట్టు తెలిసింది.