రెండోరోజూ ఇసుక, మట్టి తవ్వకాలపై విచారణ
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:06 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని వివిధ ఇసుక ర్యాంపుల్లో జరిగిన అక్రమాలపై శుక్రవారం రెండో రోజు కూడా మైన్స్ అధికారుల బృందం విచారణ కొనసాగించింది.
కోనసీమలో పలు ర్యాంపులు పరిశీలించిన మైన్స్ అధికారులు
అమలాపురం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని వివిధ ఇసుక ర్యాంపుల్లో జరిగిన అక్రమాలపై శుక్రవారం రెండో రోజు కూడా మైన్స్ అధికారుల బృందం విచారణ కొనసాగించింది. జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ దందాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమవగా, ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే!. ఈ అక్రమాల్లో జిల్లాకు చెందిన కీలక ఉన్నతాధికారితో పాటు ఇద్దరు ప్రజాప్రతినిధుల పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈమొత్తం వ్యవహారాలపై విచారణ జరిపేందుకు కాకినాడ జిల్లా మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ బి.జగన్నాథరావు ఆధ్వర్యంలోని అధికారుల బృందం రెండో రోజు శుక్రవారం ర్యాంపుల పరిశీలన చేపట్టింది. కోనసీమ జిల్లాకు చెందిన మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బి.అశోక్‌కుమార్, ఏలూరు మైన్స్ విజిలెన్స్ ఏడీ వెంకటరత్నం.. మరికొందరు అధికారులు జిల్లాలోని పలు ర్యాంపులను పరిశీలించారు. టెక్నికల్ టీమ్‌తో కలిసి జొన్నాడ ఇసుక ర్యాంపును మరోసారి పరిశీలించారు. ఇదే సమయంలో జొన్నాడ ర్యాంపు నుంచి వెళ్తున్న ఇసుక లారీని ఆపి తనిఖీ చేశారు. తూకం వేయించగా ఆ లారీలో అధిక లోడు ఉన్నట్లు నిర్ధారించి కేసు నమోడు చేశారు. అలాగే, ఆత్రేయపురం మండలం అంకంపాలెం, రావులపాలెం మండలం పొడగట్లపల్లి ఇసుక ర్యాంపును ప్రత్యేక అధికారుల బృందం తనిఖీ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని మైన్స్ అధికారులు ఈబృందం వెంట ఉండకూడదన్న నిబంధనలు మాత్రం ఉల్లంఘించారనే ప్రచారం కొనసాగుతోంది. ర్యాంపులు నిర్వహిసున్న లీజుదారులు, మట్టి ర్యాంపుల్లో లంకభూములు లీజుకు ఇచ్చిన రైతులను విచారించనున్నారు. మైన్స్ ఉన్నతాధికారుల బృందం వెంట ఆ శాఖ విజిలెన్స్ ఆర్‌ఐలు, టెక్నికల్ అసిస్టెంట్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. ర్యాంపుల నిర్వహణదారులు మాత్రం ఆ పరిసర ప్రాంతాల్లో పత్తా లేకుండాపోయారు.