అక్రమ తవ్వకాలా.. అవేంటి?
ABN , Publish Date - Apr 13 , 2026 | 06:45 AM
కోనసీమలో ఇసుక అక్రమ తవ్వకాలే జరగడం లేదని ఆ జిల్లా గనుల శాఖ అధికారి నివేదించారు. జిల్లా పరిధిలో ఏ ఒక్కచోట కూడా ఇసుక రేణువు కూడా కదిలించలేనంత నిఘా, నియంత్రణ ఉందని...
కోనసీమలో ఇసుక అక్రమ రవాణా లేదు.. భారీ వాహనాలు వెళ్లిన ఆనవాళ్లూ లేవు
జిల్లా గనుల శాఖ అధికారి నివేదిక
అమరావతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): కోనసీమలో ఇసుక అక్రమ తవ్వకాలే జరగడం లేదని ఆ జిల్లా గనుల శాఖ అధికారి నివేదించారు. జిల్లా పరిధిలో ఏ ఒక్కచోట కూడా ఇసుక రేణువు కూడా కదిలించలేనంత నిఘా, నియంత్రణ ఉందని, అక్రమాలకు ఆస్కారమే లేదని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పలు రీచ్‌లకు రెవెన్యూ యంత్రాంగాన్ని తీసుకెళ్లి ఫొటోలు దిగి వాటిని గనుల శాఖ డైరెక్టర్, ఇతర అధికారులకు పంపించారు. దీంతో కోనసీమలో ఇద్దరు వైసీపీ నేతలు చేస్తున్న ఇసుక దోపిడీ అంతా ఒట్టిదేనని ఆయన చెప్పకనే చెప్పారు. అక్రమాలకు బాసటగా నిలుస్తున్న జిల్లా కీలక ఉన్నతాధికారికి ఆయన వంత పాడినట్లయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ కీలక నేతలు, ప్రభుత్వంలో ప్రతినిధులుగా ఉన్నవారే కోనసీమ ఇసుక అక్రమ తవ్వకాలను కళ్లకు కట్టినట్లు నిరూపించేలా శాటిలైట్ చిత్రాలను తీసి ప్రభుత్వానికి పంపించారు. కానీ ఈ అధికారి నివేదిక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత, కోనసీమ జిల్లా కీలక ఉన్నతాధికారి అండదండలతో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్న విషయాన్ని కూటమి నేతలే బయటపెట్టారు. సీఎం చంద్రబాబు, గనుల శాఖకు ఫిర్యాదులు పంపారు. దీనిపై కాకినాడ గనుల అధికారితో విచారణ చేయించారు. దాన్ని సెటిల్ చేసి పక్కదోవపట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని వెనుక గోదావరి జిల్లాలకే చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి పాత్ర ఉందని చెబుతున్నారు. ఆయనపై అనేక తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి.
అంతా ప్రశాంతమట
ఈ నెల 9న ఉదయం పి.గన్నవరం, కొత్తపేటలకు చెందిన ఇద్దరు వైసీపీ నేతలు మరింతగా తెగించి గోదావరిలోకి భారీ వాహనాలను పంపి ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. దీన్ని స్థానికులు ఫొటోలు తీసి కూటమి నేతలకు అందించారు. వారు మరోసారి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. గోదావరిలోకి వెళ్లిన జేసీబీలు, ఇసుక తవ్వకాలు, నది వెంట వేసిన రహదారుల ఫొటోలు.. తేదీ, సమయంతో కూడిన ఫొటోలను ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. వీటి ఆధారంగా ‘ఆపినట్లు ఆపి, మళ్లీ మొదలుపెట్టారు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 10న వార్తను ప్రచురించింది. దీనిపై స్పందించిన గనుల శాఖ డైరెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవిక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కోనసీమ గనుల శాఖ అధికారి ఈ నెల 10న సిబ్బందిని వెంటబెట్టుకుని క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. వారితో ఫొటోలు దిగి, వాటికి అక్షాంశ, రేఖాంశాలు జోడించారు. అదే రోజు సాయంత్రం గనుల శాఖ డైరెక్టర్, ప్రభుత్వంలో కీలక వ్యక్తులకు నివేదికలు పంపించారు. లంకలగన్నవరం, జొన్నాడ, ఆత్రేయపురం తదితర ప్రాంతాలను సందర్శించామని, అక్కడ అక్రమ తవ్వకాలు జరగడం లేదని, భారీ వాహనాలు వెళ్లినట్లుగా ఆనవాళ్లే లేవని, గోదావరి తీరం అంతా ప్రశాంతంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు.
వీటి సంగతేమిటి?
కోనసీమ జిల్లా గనుల అధికారి 9, 10 తే దీల్లో ఇసుక అక్రమ తవ్వకాలే జరగ లేదని నివేదించారు. అదే నిజమైతే.. పాత గన్నవరం, జొన్నాడ తదితర ప్రాంతాల్లో గోదావరిలోకి జేసీబీలు వెళ్లి ఇసుకను తవ్వితీసిన ఫొటోలు ఎలా బయటకొచ్చాయి. అవేవీ ఏఐతో తీసినవికావు. ఆ ఫొటోలకు తీసిన సమయం, తేదీ, అక్షాంశ, రేఖాంశాలతో సహా ఉన్నాయి. శాటిలైట్ చిత్రాలూ ఉన్నాయి. ఎవరో ఆదేశాల మేరకు కోనసీమ ప్రశాంతమని నివేదికలు పంపించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లంకలగన్నవరం, జొన్నాడ ఏరియాలో నది వెంట భారీ వాహనాలు వెళ్లిన, రహదారులు ఏర్పాటు చేసుకున్న ఫొటోలు వచ్చాయి. వాటిని కూడా అధికారులు గుర్తించకపోవడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. అయితే కోనసీమ జిల్లా నుంచి వచ్చిన ఆ నివేదికను ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. కొద్దిరోజులు పరిస్థితులను గమనించి నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. తద్వారా ఏది నిజం? ఏది అబద్ధమో తేల్చాలని భావిస్తున్నారు.