Share News

కోనసీమలో కుమ్ముడు నిజమే!

ABN , Publish Date - Apr 01 , 2026 | 06:16 AM

కోనసీమ జిల్లాలో ఇసుక, మట్టి దందా ఊహించని స్థాయిలో జరుగుతోందని టీడీపీ, జనసేన నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలు అక్షర సత్యాలని వారు స్పష్టంచేసినట్లు తెలిసింది.

కోనసీమలో కుమ్ముడు నిజమే!

  • ఊహించని స్థాయిలో ఇసుక, మట్టి దందా

  • సర్కారుకు కూటమి నేతల తాజా ఫిర్యాదులు

  • క్షేత్రస్థాయి తనిఖీలు, విచారణకు సీఎం ఆదేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కోనసీమ జిల్లాలో ఇసుక, మట్టి దందా ఊహించని స్థాయిలో జరుగుతోందని టీడీపీ, జనసేన నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలు అక్షర సత్యాలని వారు స్పష్టంచేసినట్లు తెలిసింది. ‘కోనసీమలో కుమ్మేస్తున్నారు’ శీర్షికతో ఇసుక అక్రమ దందాను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం తనవద్ద అందుబాటులో ఉన్న నివేదికలతో పాటు ఇతర మార్గాల నుంచి కొత్త సమాచారం తెప్పించుకుంది. రీచ్‌ల్లో తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదిక ఇవ్వాలని గనులశాఖ డైరెక్టర్‌ డబ్ల్యూబీసీ చంద్రశేఖర్‌ను ఆదేశించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు కోనసీమ జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన నేతలు ముందుకొచ్చారు. మంగళవారం నలుగురు టీడీపీ నేతలు, ఓ జనసేన నేత ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. వీరిలో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీ రాష్ట్ర ఇరిగేషన్‌ అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) చైర్మన్‌ వేగుళ్ల లీలాకృష్ణ తదితరులు ఉన్నారు. ఇసుక, మట్టి అక్రమాలపై మరిన్ని కొత్త అంశాలను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.


కీలక ఉన్నతాధికారి కనుసన్నల్లోనే..

‘‘కోనసీమ జిల్లాలో వైసీపీ మాజీ ఎంపీ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. ఇందులో జిల్లా కీలక ఉన్నతాధికారి ఒకరు కర్త, కర్మ, క్రియగా పనిచేస్తున్నారు. ఒకరకంగా సిండికేట్‌ను ఆయనే నడుపుతున్నారు. అధికారిక రీచ్‌ల్లోనూ అక్రమాలను కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం బాట, లోడింగ్‌ చార్జీలు రూ.145 చొప్పున 4.5 టన్నుల ట్రాక్టర్‌కు రూ.652 వసూలు చేయాలి. కానీ రూ.1,200 వసూలు చేస్తున్నారు. పది టన్నుల లారీకి రూ.3వేలు, 17 టన్నుల లారీకి రూ.5వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇది అధికారికంగా స్కానర్‌ ద్వారా వసూలు చేస్తున్న ఫీజు. అనధికారికంగానూ మరింతగా వసూలు చేస్తున్నారు.ఆత్రేయపురం, మందపల్లి, గోపాలపురం, రావులపాలెం, ఉడిమూడి, ఇంకా మరికొన్ని రీచ్‌లను అనధికారికంగా ఏర్పాటుచేసి రేయింబవళ్లు ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. మొన్నటి వరకు జిల్లాలో పనిచేసిన గనులశాఖ అధికారి ఈ అక్రమాలకు అన్ని విధాలుగా సహకరించారు. ఆయన పాత్రపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. జిల్లా కీలక ఉన్నతాధికారికి ప్రతినెలా 20 శాతం నుంచి 30శాతం వాటా ఇస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న తన ఏజెంటు సాయిశ్రీను ద్వారా సొమ్ములు తీసుకుంటున్నారు. వీటిన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’’ అని తమ ఫిర్యాదుల్లో నేతలు కోరారు.


బడా అధికారి అండదండలు

ఇసుక దందా నడుపుతున్న జిల్లా కీలక ఉన్నతాధికారికి ఉన్నత స్థాయిలో అండదండలున్నాయని తెలిసింది. సీనరేజీ నిధులు పక్కదారి పట్టించిన అంశాన్ని ప్రభుత్వం సీరియ స్‌గా పరిగణించకుండా, ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆయన గ్రూపు వ్యవహారాలు నడుపుతున్నారని సమాచారం. ఇసుక, మట్టి దందాల్లో వచ్చే అక్రమ సొమ్ములో కొంత భాగాన్ని ప్రతినెలా అమరావతిలోని బడా అధికారికి పంపిస్తున్నారని జిల్లా నేతలే చెబుతున్నారు. అందుకే ఆ అధికారిపై ఈగ వాలనివ్వకుండా మంత్రాంగం నడుపుతున్నారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. కోనసీమ గనుల శాఖ అధికారులు అమరావతికి వచ్చినా ఉన్నతాధికారిపై ఏవివరాలు చెప్పనివ్వకుండా అడ్డుకున్నారని, అనవసర విషయాలు మాట్లాడొద్దని హెచ్చరించారని తెలిసింది. ఇదిలాఉండగా టీడీపీ, జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన సీఎం చంద్రబాబు... క్షేత్రస్థాయి తనిఖీలు జరిపి, విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి రాజమౌళిని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో కోనసీమ ఇసుక, మట్టి దందాలపై వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తునకు గనుల శాఖను ఆదేశించారు.

Updated Date - Apr 01 , 2026 | 06:16 AM