రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైల ప్రత్యేక పాత్ర
ABN , Publish Date - Mar 15 , 2026 | 03:33 AM
రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలు ప్రత్యేక పాత్ర పోషించే విధంగా కృషి చేస్తానని కోమటి జయరాం అన్నారు.
రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టే సామర్థ్యం చంద్రబాబుకే ఉంది: కోమటి జయరాం
అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టమొచ్చినా జయరాం ముందుంటారు: జస్టిస్ ఎన్వీ రమణ
పెనమలూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలు ప్రత్యేక పాత్ర పోషించే విధంగా కృషి చేస్తానని కోమటి జయరాం అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, సేవా రంగంలో ఎన్నారైల పాత్ర విస్పష్టంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంకు ఆత్మీయ సత్కార సభ శనివారం కృష్ణాజిల్లా పోరంకి మురళీ రిసార్ట్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో కుంటుబడ్డ రాష్ర్టాన్ని తిరిగి గాడిన పెట్టగలిగే సామర్థ్యం ఒక్క చంద్రబాబుకే ఉందని, ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు తాము చేయగలిగినంత కృషి చేశామని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌కు ఎన్నారైలు నిరంతరం చేదోడువాదోడుగా ఉంటారని స్పష్టం చేశారు. సభలో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమొచ్చినా కోమటి జయరాం నేనున్నానంటూ ముందుకొచ్చి వారి ఇబ్బందులకు పరిష్కారాలు చూపుతున్నారని కితాబిచ్చారు. ఇతర దేశాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారని చెప్పారు. 1984 నుంచి తనకు జయరాంతో స్నేహం కొనసాగుతోందని తెలిపారు. టీడీపీతో జయరాంకు ప్రత్యేక అనుబంధం ఉందని, అమరావతి ఉద్యమంలో ఉద్యమకారుల వెన్నంటి ఉండి వారి పోరాటానికి ఆర్థిక, న్యాయ సహాయం అందించారని గుర్తుచేశారు. సమాజ సేవ, మానవత్వం వంటి విషయాలను జయరాం వద్ద అందరూ నేర్చుకోవాలని సూచించారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, అమెరికాలో మనవాళ్లకు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయని, వాటిని నేర్పుగా పరిష్కరించే బాధ్యత జయరాం తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, తాను అమెరికా వెళ్లకముందే జయరాంకు మంచి పేరు ఉందని, భారత్ నుంచి ఎవరు అమెరికా వెళ్లినా ఆయన్ను కలుస్తారని తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను అనేక దేశాల్లో నిర్వహించిన ఘనత జయరాంకు దక్కుతుందన్నారు. ఎన్నారైలు అంటే అమెరికాలో కంప్యూటర్ కీబోర్డు మాత్రమే కాదు అవసరమయితే టీడీపీ జెండా కూడా పట్టుకుంటారని నిరూపించిన వ్యక్తి జయరాం అని కొనియాడారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, అమెరికాలో ఎంతోమంది ఎన్నారైలను సంఘటితం చేయడంలో జయరాం విజయవంతమయ్యారని తెలిపారు. అనంతరం కోమటి జయరాంను ఘనంగా సత్కరించారు. ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేష్, మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు, బొండా ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, పలువురు ప్రముఖ ఎన్నారైలు, అభిమానులు పాల్గొన్నారు.