వైసీపీ ఉన్మాదం.. ఉగ్రవాదం కంటే ప్రమాదకరం
ABN , Publish Date - Apr 15 , 2026 | 06:01 AM
అధికారం కోసం, ఆస్తి కోసం కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా లెక్క చేయకుండా తన రక్తసంబంధీకులతో శాపనార్థాలు పెట్టించుకునే స్థాయికి జగన్ దిగజారిపోయారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
ఎంపీలే ఆత్మాహుతి దళం అని మాట్లాడుతున్నారు
అది పార్టీయా..! ఉగ్రవాద ముఠానా..?: మంత్రి పార్థసారథి
అమరావతి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): అధికారం కోసం, ఆస్తి కోసం కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా లెక్క చేయకుండా తన రక్తసంబంధీకులతో శాపనార్థాలు పెట్టించుకునే స్థాయికి జగన్ దిగజారిపోయారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ అనుసరిస్తున్న అరాచక విధానాలు, ఆ పార్టీ నాయకుల ఆలోచనా ధోరణిని చూస్తుంటే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఆల్‌ఖైదా, ఐఎస్ వంటి వాటికీ, వీరికీ పెద్ద తేడా లేదనిపిస్తోంది’ అన్నారు. ‘జగన్ రెడ్డి ఏం చెబితే అది చేస్తాం.. అవసరమైతే ఆత్మాహుతి దళంగా మారుతాం... అని మిథున్ రెడ్డి వంటి సీనియర్ ఎంపీ మాట్లాడటం చూస్తుంటే... వైసీపీ ప్రజాస్వామ్య పార్టీనా? లేక ఉగ్రవాద ముఠానా..! అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఉగ్రవాదుల నోట ఆత్మాహుతి దళం అనే మాట వింటాం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు వైసీపీ ఎంపీలే తాము జగన్ కోసం ఆత్మాహుతి దళాలుగా మారుతామని చెప్పడం వారి ఉన్మాదానికి పరాకాష్ఠ’ అని మంత్రి మండిపడ్డారు. నిరంతరం నరుకుతాం, చంపుతాం అని బెదిరించే వారి భాష ఉగ్రవాదుల కంటే ఘోరంగా ఉందని, అందుకే ప్రజలు వైసీపీని ఒక రాజకీయ పార్టీగా కాకుండా గొడ్డలి పార్టీగా చూస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు.