Share News

పక్షుల కొంప.. ‘కొల్లేరు’!

ABN , Publish Date - May 31 , 2026 | 05:42 AM

వందలాది పక్షుల కిలకిలరావాలు... గుంపులు గుంపులుగా ఎగిరే సైబీరియా పక్షులు... ఓ చెట్టు పైనుంచి మరో చెట్టుపైకి.. ఆ చెట్టు పైనుంచి ఒక్కసారిగా నీటిలో దూకి.. చేపను నోట కరచుకుని మళ్లీ చెట్టెక్కి..

పక్షుల కొంప.. ‘కొల్లేరు’!

  • ఎండిపోయి ఎడారిని తలపిస్తున్న కొల్లేరు

  • ఆహారం, ఆశ్రయం వెతుక్కుంటూ వెళ్లిపోయిన పక్షులు

  • ఆక్రమణలు తొలగిస్తేనే కొల్లేరుకు వెలుగు

(ఆంధ్రజ్యోతి-మండవల్లి)

వందలాది పక్షుల కిలకిలరావాలు... గుంపులు గుంపులుగా ఎగిరే సైబీరియా పక్షులు... ఓ చెట్టు పైనుంచి మరో చెట్టుపైకి.. ఆ చెట్టు పైనుంచి ఒక్కసారిగా నీటిలో దూకి.. చేపను నోట కరచుకుని మళ్లీ చెట్టెక్కి వాటిని ఆరగించే దృశ్యాలు.. నీటిపై పక్షుల సయ్యాటలు... పర్యాటకులను కట్టిపడేసే అందాలు.. ఇదీ ఆటపాక పక్షుల కేంద్రం పేరు వింటే పర్యాటకులకు గుర్తొచ్చే అందమైన దృశ్యమాలిక. ఇదంతా గతం. ఈ వేసవిలో అక్కడ అంతా నిశ్శబ్దం తాండవిస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందిన కొల్లేరు ప్రస్తుతం ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది. పరవళ్లు తొక్కే.. నీటితో కళకళలాలే సరస్సు... బీటలు వారిన నేలతో దయనీయంగా కనిపిస్తోంది. పక్షులకు ఆహారం, ఆశ్రయం లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయి. ఎగరలేని కొన్ని మాత్రమే ఇంకా చెట్లపై కనిపిస్తున్నాయి. ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం దుస్థితి ఇది. కొల్లేరు కాంటూరులో పెరుగుతున్న అక్రమ ఆక్వా చెరువులు సరస్సు సహజ స్వరూపాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆక్వా చెరువుల కోసం నీటిని మళ్లించడం వల్ల సరస్సులో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. కొల్లేరు ప్రాంతంలో ఏడాది పొడవునా నీరు ఉండేలా రెగ్యులేటర్‌ నిర్మించాలని పలు కమిటీలు గతంలో సూచించినా.. ఇంతవరకూ ఆచరణలోకి రాలేదు. కొల్లేరు పరిరక్షణకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ), సుప్రీంకోర్టు పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా అమలుకు నోచుకోలేదు. ఆక్రమణలను తొలగించి, సరస్సులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆటపాక పక్షుల కేంద్రాన్ని పునరుద్ధరించి, కొల్లేరు జీవవైవిధ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.

Updated Date - May 31 , 2026 | 05:43 AM