కమనీయం.. కోదండరాముని కల్యాణం
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:22 AM
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాత్రి 6.30 నుంచి 8.30 గంటల వరకు కల్యాణం వేడుక కనులపండువగా సాగింది.
కడప, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాత్రి 6.30 నుంచి 8.30 గంటల వరకు కల్యాణం వేడుక కనులపండువగా సాగింది. టీటీడీ ఆగమ పండితులు రాజేశ్ భట్టర్ రాత్రి 8.10 గంటలకు మాంగల్యాధారణ చేశారు. ఆ సమయంలో కల్యాణ ప్రాంగణం సీతారామ నామస్మరణలతో మార్మోగింది. నింగి నుంచి పున్నమి చంద్రుడు చూస్తుండగా పండు వెన్నెల్లో, ఆహ్లాదకరమైన వాతావరణంలో లక్షలాది మంది భక్తుల సమక్షంలో కల్యాణ క్రతువును వేడుకగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. వీరివెంట మనుమడు దేవాంశ్ కూడా ఉన్నాడు. అంతకుముందు మంత్రులు, టీటీడీ, జిల్లా అధికారులతో కలిసి సీఎం దంపతులు కోదండ రామాలయానికి చేరుకున్నారు. సీతారామలక్ష్మణ మూలమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదిక వద్దకు చేరుకొని భక్తిశ్రద్ధలతో కల్యాణోత్సవాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. కాగా, బుధవారం సాయంత్రం కోదండ రామాలయం నుంచి సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర కల్యాణ వేదిక వరకు వేడుకగా సాగింది. వేదిక వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. అమ్మవారి తరఫున అర్చకులు శ్రీనివాస్, స్వామివారి తరఫున రాజేశ్ స్వామి పాల్గొన్నారు.
అయోధ్యను తలపించిన కల్యాణ వేదిక
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం కోసం టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా త్రేతాయుగం నాటి అయోధ్యను గుర్తుకు తెచ్చేలా కల్యాణ వేదికను అందంగా తీర్చిదిద్దారు. రంగురంగుల పుష్పాలతో వేదికను సుందరంగా అలంకరించారు. వేదికపై ప్రాచీన ఆలయాలలోని కళాకృతులు, దశావతారాల సెట్టింగ్, రామాయణలోని ఘట్టాలను అక్రిలిక్ పెయింటింగ్‌లతో వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. తెలుగుదనం ఉట్టిపడేలా చెరుకు, టెంకాయ గెలలు, టెంకాయ పూత, అరటి ఆకులు, మామిడాకులతో పాటు విదేశీ పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారు. ఇందుకోసం 5టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు పర్యవేక్షణలో 100 మంది అలంకరణ నిపుణులు, 100 మంది టీటీడీ సిబ్బంది రెండు రోజుల పాటు కల్యాణ వేదికను తీర్చిదిద్దారు. వేదిక ప్రాంగణంలో 121 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. భక్తులు వీక్షించేందుకు పెద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్ ఏర్పాటు చేశారు. రాములోరి కల్యాణానికి సుమారు 80వేల మంది భక్తులు హాజరయ్యారు. భక్తులకు అన్నప్రసాదంతో పాటు ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ అందించింది.

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన
పవిత్రమైన రోజున లోక్‌సభలో అమరావతికి ఆమోదం: సీఎం
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రామ రాజ్యం అంటేనే సుపరిపాలన గుర్త్తుకు వస్తుందని తెలిపారు. ‘‘మనందరికీ ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. సీతారాముల కల్యాణం మనందరి అదృష్టం. వేంకటేశ్వర స్వామి కూడా మన రాష్ట్రంలోనే కొలువై ఉండటం గొప్ప వరం. రాముడు రామరాజ్యాన్ని అందించినట్లుగానే రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా కూటమి పాలన సాగిస్తున్నాం. ప్రజలందరికీ సంపద, ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థించా. ఈ పవిత్రమైన రోజే లోక్‌సభలో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందింది. నాడు అమరావతి రాజధానిగా దేవేంద్రుడు పాలిస్తే నేడు ప్రజా రాజధానిగా అమరావతి ఉంది. రాముడు రామరాజ్యాన్ని ఇచ్చినట్లుగానే రాముడి ఆశీస్సులతో ధర్మాన్ని పాటించి మీకు అండగా ఉంటా’’ అని సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ‘జై శ్రీరామ్’ అనడంతో భక్తులు కూడా ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రికి ఆలయ పండితులు స్వామివార్ల చిత్రపటాన్ని అందించి ప్రసాదాలు అందించారు.