Share News

హైకోర్టుకు కొడాలి నాని

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:10 AM

వైసీపీ ప్రభుత్వ హయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పైనా, ప్రతిపక్షనేత చంద్రబాబుపైనా అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై..

 హైకోర్టుకు కొడాలి నాని

  • చంద్రబాబుపై దూషణల కేసులో ప్రాసిక్యూషన్‌కు అనుమతిపై పిటిషన్‌

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పైనా, ప్రతిపక్షనేత చంద్రబాబుపైనా అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఈ నెల 18న జారీ చేసిన జీవో 801 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ మాజీ మంత్రి, వైసీపీనేత కొడాలి నాని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సంబంధిత జీవోను రాజ్యాంగ, చట్టవిరుద్ధమైనదిగా ప్రకటిస్తూ దానిని రద్దు చేయాలని కోరారు. ఘటన 2021 ఫిబ్రవరి జరిగిందని, క్రిమినల్‌ చట్టాల ప్రకారం తన పై నమోదైన సెక్షన్ల కింద కేసును కాగ్నిజెన్స్‌లోకి తీసుకొనే కాలపరిమితి ముగిసిందని తెలిపారు. ఇలాంటి కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు. కాగా, వైసీపీ హయాంలో నాటి పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని ఎస్‌ఈసీ జాయింట్‌ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుడివాడ పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను అనుమతించాలని ప్రతిపాదిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 5న కృష్ణాజిల్లా కలెక్టర్‌ లేఖ రాశారు. దాని ఆధారంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఇటీవల జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 23 , 2026 | 05:11 AM