Share News

కేఎన్‌ఆర్‌ కుమ్ముడు

ABN , Publish Date - May 31 , 2026 | 05:14 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ వ్యక్తిగత సహాయకుడు కె.నాగేశ్వరరెడ్డి(కేఎన్‌ఆర్‌) అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి.

కేఎన్‌ఆర్‌ కుమ్ముడు

  • పెరిగిపోతున్న జగన్‌ పీఏ అక్రమాస్తుల చిట్టా

  • తాజాగా తెరపైకి దండా వీరారెడ్డి

  • విజయవాడలో 5400 చ.గ. స్థిరాస్తి

  • హైదరాబాద్‌ కోకాపేటలో విల్లా కొనుగోలు

  • బార్‌లో భాగస్వాముల నుంచి ఆఫ్రికాలో లిక్కర్‌ వ్యాపారం చేసే స్థాయికి

  • విశాఖలో మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌లో దందా

  • కూటమి ప్రభుత్వం రాగానే లోకేశ్‌ రెడ్డిగా పేరు మార్చుకుని హైదరాబాద్‌కు మకాం

  • రోజుకో బినామీ పేరు వెలుగులోకి

అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్‌ వ్యక్తిగత సహాయకుడు కె.నాగేశ్వరరెడ్డి(కేఎన్‌ఆర్‌) అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఆయన అక్రమాస్తుల చిట్టా చాంతాడంత పెరిగిపోతోంది. జగన్‌ అధికారం అండతో వందల కోట్ల విలువైన ఆస్తులు సంపాదించిన కేఎన్‌ఆర్‌ బినామీలూ రోజుకొకరు వెలుగులోకి వస్తున్నారు. ఆయన చిన్ననాటి స్నేహితుడు, కడప జిల్లాకు చెందిన పుత్తా శివశంకరరెడ్డి బినామీగా ఉన్నట్టు సిట్‌ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. తాజాగా గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన దండా వీరారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్‌ పీఏ హోదాలో కేఎన్‌ఆర్‌ సంపాదించిన అక్రమ సొమ్ములో సింహభాగం దండా వీరారెడ్డి, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో పెట్టినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు కేఎన్‌ఆర్‌ను విచారించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అక్రమాల బాగోతం వెలుగు చూసింది. మూడు రాష్ట్రాల్లో ఆస్తులు, ఇళ్లు, భూములు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో దండా వీరారెడ్డితోనూ కలిసి భారీగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్‌లో ఒక బార్‌లో వ్యాపార భాగస్వాములుగా ఉన్న ఈ ఇద్దరూ.. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా ఆఫ్రికాలోని ఒక దేశం రాజును కలిసి అక్కడ లిక్కర్‌ వ్యాపారాలు చేశారు.


విజయవాడలోని రామవరప్పాడు ప్రాంతంలో 5400 చదరపు గజాల స్థిరాస్తి, హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో కోట్ల విలువ చేసే అత్యంత విలాసవంతమైన విల్లాను వీరారెడ్డి భార్య పేరుతో కొనుగోలు చేసినట్లు తెలిసింది. విశాఖపట్నం ప్రాంతంలో లేటరైట్‌ మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌లో దందాల నుంచి ఏదీ వదలకుండా వసూళ్లు చేశారు. ఇందుకోసం బినామీ వీరారెడ్డి చేతికి గన్‌ ఇచ్చి విజయవాడ పటమట పోలీసులతో కేఎన్‌ఆర్‌ లైసెన్స్‌ ఇప్పించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వీరారెడ్డి తను పేరును లోకేశ్‌ రెడ్డిగా మార్చుకుని హైదరాబాద్‌కు మకాం మార్చాడు.


వైఎస్‌ హయాం నుంచే బంధం

వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌లో ఒక బార్‌లో దండా వీరారెడ్డి భాగస్వామిగా చేరాడు. అక్కడే గెస్ట్‌ హౌస్‌ ఏర్పాటు చేసుకున్నాడు. అప్పట్లో ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిన ఆయన లిక్కర్‌ వ్యాపారంలోకి దిగాడు. జగన్‌ మొదటి సారి కాంగ్రెస్‌ తరఫున కడప ఎంపీ అయినప్పుడు పీఏగా ఆయన వద్ద చేరిన కేఎన్‌ఆర్‌కు వీరారెడ్డితో బంధం పెరిగింది. ఎస్‌ఆర్‌నగర్‌లో వీరారెడ్డి గెస్ట్‌ హౌస్‌కు వెళుతూ కొన్ని రోజులకే బార్‌లో భాగస్వామి అయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు సహకరించాల్సిందిగా దండా వీరారెడ్డి కోరడంతో కేఎన్‌ఆర్‌ తోడ్పాటు అందించి తనకు రావాల్సిన ప్రతిఫలాన్ని తీసుకున్నట్లు సమాచారం. 2009లో వైఎస్‌ మరణించడం, తర్వాత జగన్‌పై కేసులు నమోదై జైలుకు వెళ్లడంతో వీరిద్దరి రియల్‌ వ్యాపార జోరు తగ్గింది.

జగన్‌ సీఎం అయ్యాక..

జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక దండా వీరారెడ్డి హైదరాబాద్‌ నుంచి మకాం తాడేపల్లికి మార్చాడు. కేఎన్‌ఆర్‌, వీరారెడ్డి ఇద్దరూ కలసి అడ్డూ అదుపూ లేకుండా వసూళ్ల పర్వం నడిపించారు. ఆఫ్రికా దేశాల్లో లిక్కర్‌ వ్యాపారం చేసే స్థాయికి ఎదిగారు. ఆఫ్రికాలోని ఒక దేశానికి ఇద్దరూ వెళ్లి అక్కడి రాజును కలిసినట్లు పాస్‌పోర్టు వివరాల ద్వారా పోలీసులు గుర్తించారు. వీరారెడ్డి, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో కేఎన్‌ఆర్‌ అక్రమాస్తులు పెట్టినట్లు ఇప్పటికే ఈడీకు తెలిసింది. దీంతో విచారణకు రావాలంటూ కేఎన్‌ఆర్‌కు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో ఏపీ, తెలంగాణలో ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఆరా తీస్తున్న పోలీసులకు విజయవాడలోని పటమటలో వీరారెడ్డికి గన్‌ లైసెన్స్‌ ఇప్పించింది కేఎన్‌ఆర్‌ అని తెలిసింది. వీరి వ్యాపారాలు ఇంకెన్ని ఉన్నాయి? బాధితులు ఎంతమంది అనే దానిపై సిట్‌ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.

Updated Date - May 31 , 2026 | 05:17 AM