ష్.. గప్‌చుప్!
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:02 AM
అధికార దర్పంతో రూ.వందల కోట్లు అక్రమంగా పోగేసుకున్న జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్).. తన ఆస్తుల వివరాలు బయటపడకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నాడు.
పోలీసులకు ఏమీ చెప్పొద్దు
చెప్పారో.. వచ్చేది మా ప్రభుత్వమే
బినామీలకు కేఎన్‌ఆర్ వార్నింగ్!
వారి పేరిట ఉన్న ఆస్తుల్లో ఎక్కువ భాగం వారికే ఇచ్చేస్తానంటూ వరుస ఫోన్లు
సిట్ విచారణకు ఫోన్లు తీసుకెళ్లొద్దని సూచన
వాటిని ధ్వంసం చేసి కొత్తవి తీసుకోవాలని సలహా
పసిగట్టిన సిట్.. బినామీలకు నోటీసులు
కేఎన్‌ఆర్, పుత్తా సహా నేడు 8 మంది విచారణ
బెజవాడలో హ్యుండాయ్ షోరూం యజమానికి రూ.4.5 కోట్లు చెల్లించినట్లు బట్టబయలు
ఇందులో 2 కోట్లు కేఎన్‌ఆర్ భార్య ఖాతా నుంచి, ఇంకో 2.5 కోట్లు ఇతరుల అకౌంట్ల నుంచి బదిలీ
అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): అధికార దర్పంతో రూ.వందల కోట్లు అక్రమంగా పోగేసుకున్న జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్).. తన ఆస్తుల వివరాలు బయటపడకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నాడు. తన బినామీలకు తెగ ఫోన్లు చేస్తున్నాడు. ఈ విషయంలో నోరుమెదపవద్దని.. పోలీసులకు ఏదీ చెప్పవద్దని.. ఒకవేళ చెబితే.. రేపు వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. రూ.10 వేల జీతం తీసుకునే ఈ ఉద్యోగి.. దేశ విదేశాల్లో వందల కోట్ల రూపాయల ఆస్తులకు ఎదిగిన తీరు.. మద్యం వ్యాపారులు మొదలుకొని తాను జగన్ ప్రభుత్వంలో దోచుకున్న సొమ్ము, వైసీపీలో పలువురి నుంచి వసూలు చేసిన డబ్బుల వివరాలు వరుసగా వెలుగుచూస్తుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబంతో కేఎన్‌ఆర్ జరిపిన ఆర్థిక వ్యవహారాల్లో వివరణ కోసం గత వారం సిట్ అధికారులు అతడికి నోటీసిచ్చి విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. తిరుపతి-చిత్తూరు మధ్య చెవిరెడ్డి కుటుంబం వేసిన 47 ఎకరాల వెంచర్‌లో ఏకంగా పదెకరాలు కొనుగోలు చేసిన కేఎన్‌ఆర్‌ను ప్రశ్నించారు. అధికారికంగా రూ.81 లక్షలు చెల్లించి కొనుగోలు చేసిన ఆ స్థిరాస్తి అసలు విలువఎంత.? అధికారికంగా చూపిన డబ్బు ఆ రూ.81 లక్షలు ఎలా సంపాదించారని అడిగారు.
ఈ విచారణలో రోజుకొక కొత్త భాగోతం, ఆస్తులకు సంబంధించిన అంశాలు, బినామీల పేర్లు బయటకు వస్తుండడంతో కేఎన్‌ఆర్ విలవిలలాడుతున్నట్లు తెలుస్తోంది. మొదటిరోజు విచారణలో అతడి చిన్ననాటి స్నేహితుడు, వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి పేరుతో ఉన్న ఆస్తులు బయటపడగా.. రెండో రోజు మరో వ్యాపార భాగస్వామి దండా వీరారెడ్డి అలియాస్ లోకేశ్‌రెడ్డి గుట్టు రట్టయింది. అలాగే కేఎన్‌ఆర్ భార్య సోదరుడి పేరుతో ఉన్న ఐటీ కంపెనీ, విజయవాడలోని హ్యుండాయ్ కార్ల షోరూంలో సింహ భాగం, విశాఖపట్నంలో దందాలు వరుసగా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన బినామీలందరిపై సిట్ దృష్టి సారించింది. దీంతో కేఎన్‌ఆర్ వారికి ఫోన్లు చేసి.. ’విచారణలో పోలీసులు ఏమడిగినా చెప్పొద్దు.. మిమ్మల్ని ఏమీ కొట్టరు.. అవసరమైతే మీ పేరుతో ఉన్న ఆస్తుల్లో ఎక్కువ భాగం మీకే రాసిస్తా.. మీ ఫోన్లు తీసుకెళ్లొద్దు.. వాటిని ధ్వంసం చేసి కొత్త ఫోన్లు పట్టుకెళ్లండి.. అవసరమైతే సిమ్ కూడా కొత్తది తీసుకోండి’ అని చెబుతున్నట్లు తెలిసింది. ఎవరైనా భయంతో కాదంటే.. ‘మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. జాగ్రత్త’ అని హెచ్చరిస్తున్నట్లు సిట్ అధికారులు పసిగట్టారు. కేఎన్‌ఆర్ బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులు, దందాలు, పైరవీలు, బినామీల జాబితా సిద్ధం చేసుకుని వాటన్నింటికీ డబ్బులు ఎక్క డి నుంచి వచ్చాయ్.. అందులో మద్యం ముడుపుల సొమ్మెంత అనేది తేల్చబోతున్నారు. కేఎన్‌ఆర్, పుత్తా శంకర్‌రెడ్డి, లక్కీ హ్యుండాయ్ భాగస్వామి ఉస్మాన్ ఆడిటర్లు ఇచ్చిన వివరాలను పరిశీలించాక.. సోమవారం విచారణకు రావాలని పలువురికి సిట్ నోటీసులు జారీ చేసింది.
అక్రమాల తీగలాగుతున్న సిట్..
మద్యం స్కాం కేసులో నిందితుడైన చెవిరెడ్డితో జరిపిన లావాదేవీలు, తిరుపతి జిల్లాలో పదెకరాల కొనుగోలుపై సిట్ కేఎన్‌ఆర్ వివరణ తీసుకునే క్రమంలో విజయవాడలో హ్యుండాయ్ కార్ల షోరూంలో భాగస్వామ్యం వెలుగులోకి వచ్చింది. కేఎన్‌ఆర్ రూ.2 కోట్లు చెల్లించి 51శాతం వాటా రాయించుకున్నట్లు మొదట్లో సమాచారం ఉంది. ఆ సొమ్ము కేఎన్‌ఆర్ భార్య ఖాతా నుంచి చెల్లించినట్లు తేలింది. కార్ల షోరూం అసలు యజమాని ఉస్మాన్‌ను పిలిపించి ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలించగా రూ.4.50 కోట్లు చెల్లించినట్లు బయటపడింది. అందులో మిగతా రూ.2.5 కోట్లు ఇతరుల ఖాతాల నుంచి బదిలీ అయింది. వారికి సిట్ నోటీసులు జారీచేసినట్లు తెలిసింది. సోమవారం కేఎన్‌ఆర్, పుత్తా శంకర్‌రెడ్డి సహా 8 మందిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. కాగా.. పలువురు కేఎన్‌ఆర్ బాధితులు (వైసీపీ నేతలు సహా).. జగన్ పీఏ బాగోతాన్ని పోలీసులకు చెబుతున్నట్లు సమాచారం.