Share News

ఆక్రమణల తొలగింపునకు మోకాలడ్డు

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:05 PM

మండల కేంద్రం ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపునకు వైసీపీ నాయకులు అడ్డు పడుతున్నారు.

ఆక్రమణల తొలగింపునకు మోకాలడ్డు
పాత బస్టాండ్‌- హనుమాన్‌ జంక్షన్‌ ప్రధాన రహదారికి ఆనుకుని చేపలు విక్రయిస్తున్న వ్యాపారి

రోడ్డు పక్కన మాంసాహార దుకాణాలను తొలగించకుండా అడ్డు పడుతున్న వైసీపీ నేతలు

నోటీసులు ఇచ్చి వెనక్కి తగ్గిన పంచాయతీ అధికారులు

చింతపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపునకు వైసీపీ నాయకులు అడ్డు పడుతున్నారు. అక్కడ మాంసాహర దుకాణాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలను గుర్తించి మండల పరిషత్‌, పంచాయతీ అధికారులు నాలుగు వారాల క్రితం వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. అయితే వైసీపీ నాయకుల ఒత్తిళ్ల వల్ల అధికారులు వెనకడుగు వేశారు. దీంతో గిరిజన సంఘం నాయకులు దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

చింతపల్లి పాత బస్టాండ్‌ నుంచి హనుమాన్‌ జంక్షన్‌(జాతీయ రహదారి జంక్షన్‌) వరకు ప్రధాన రహదారి రద్దీగా వుంటుంది. నాలుగేళ్ల క్రితం వరకు మాంసాహారం, చేపల దుకాణాలు గ్రామ శివారు సంతబయలులో మాత్రమే ఉండేవి. సంతబయలులోనే ప్రతి బుధవారం, ఆదివారం, మంగళవారం, శుక్రవారం చేపలు, మాంసాహారం విక్రయించేవారు. కొంత మంది వ్యాపారులు స్వప్రయోజనాలకు పాత బస్టాండ్‌ నుంచి హనుమాన్‌ జంక్షన్‌ ప్రధాన రహదారి మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని మాంసాహారం, చేపల దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ దుకాణాల నుంచి వస్తున్న దుర్గంధం వల్ల ఇటుగా వెళ్లే వాహనచోదకులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతో పాటు కుక్కల బెడద పెరిగింది. గతంలో ఇక్కడ మాంసాహార దుకాణం వద్ద సంచరిస్తున్న ఒక కుక్క కరవడంతో లోతుగెడ్డ జంక్షన్‌కి చెందిన గ్రామ సచివాలయం ఉద్యోగి మృతి చెందారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం

నాలుగు వారాల క్రితం ఆక్రమణదారులకు మండల పరిషత్‌, పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే వైసీపీ నాయకుల ఒత్తిడి వల్ల చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాడేరులో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్‌ తెలిపారు.

Updated Date - Feb 08 , 2026 | 11:05 PM