Agricultural Technology: ఒక్క క్లిక్‌తో ‘కిసాన్ డ్రోన్’ సేవలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:35 AM
ఒక్క క్లిక్‌తోనే ‘కిసాన్ డ్రోన్’ సేవలు అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. క్యాబ్ బుకింగ్ తరహాలో రైతులు కూడా...
క్యాబ్ తరహాలో బుక్ చేసుకునే విధానం
రైతులకు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం
ప్లే స్టోర్‌లో ‘ఊబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్’ యాప్
అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఒక్క క్లిక్‌తోనే ‘కిసాన్ డ్రోన్’ సేవలు అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. క్యాబ్ బుకింగ్ తరహాలో రైతులు కూడా కిసాన్ డ్రోన్లను బుక్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ‘ఊబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దానిద్వారా డ్రోన్లను బుక్ చేసుకోవచ్చు. లేదా రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయశాఖ ఏర్పాటుచేసిన డ్రోన్ సేవల వాల్‌పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, డ్రోన్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా అనేక రకాల సేవల్ని రైతులు పొందవచ్చని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడైనా పొలాలకు పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు చల్లడానికి డ్రోన్‌ను అద్దెకు తీసుకోవచ్చు. ఎక్కువ విస్తీర్ణం ఉన్నా.. డ్రోన్‌తో సులభంగా పని అయిపోతుంది. సమయం, కూలీల ఖర్చు ఆదా అవుతుంది. దాదాపు సమీప డ్రోన్ నిర్వాహకుల నుంచే సేవలు పొందే అవకాశం ఉంటుంది. దూరం, విస్తీర్ణాన్ని బట్టి డ్రోన్ నిర్వాహకులు చార్జీవసూలు చేస్తారు’’ అని తెలిపారు.