Share News

కిసాన్‌ డ్రోన్లు ఇక అంతేనా?!

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:41 AM

వ్యవసాయంలో ఖర్చు తగ్గి.. పని తేలిక అవడానికి డ్రోన్లు మంచి సాధనం! అయితే.. రాష్ట్రంలో కిసాన్‌ డ్రోన్ల పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2024-25లో 875 డ్రోన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం.

కిసాన్‌ డ్రోన్లు ఇక అంతేనా?!

అధికారుల అలసత్వం.. పథకం అమలులో తీవ్ర జాప్యం

ఏడాదిగా రైతు బృందాల ఎదురుచూపులు

ఆర్థిక సంవత్సరం ముగిసినా టెండర్లు పిలవని దుస్థితి

నిధులు వెనక్కి మళ్లే పరిస్థితి?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వ్యవసాయంలో ఖర్చు తగ్గి.. పని తేలిక అవడానికి డ్రోన్లు మంచి సాధనం! అయితే.. రాష్ట్రంలో కిసాన్‌ డ్రోన్ల పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2024-25లో 875 డ్రోన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం.. 2025-26లో వెయ్యి డ్రోన్లు రైతులకు అందించాలని నిర్ణయించింది. రూ.10లక్షల విలువైన డ్రోన్‌ను 80శాతం రాయితీపై రైతు బృందాలకు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం సబ్సిడీ కింద రూ.80కోట్లు కేటాయించింది. కానీ అధికారుల అలసత్వం కారణంగా రెండో ఏడాదే పథకం నీరుగారే పరిస్థితి ఏర్పడింది. మార్చి నెలలోపు పంపిణీ చేయాల్సిన డ్రోన్లకు ఇప్పటికీ టెండర్లు పిలవలేదు. గత ఆర్థిక సంవత్సరం ముగియడంతో డ్రోన్లకు కేటాయించిన నిధులు వెనక్కి మళ్లే పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఫైలు ఎందుకు కదలలేదో.. టెండర్లు ఎందుకు పిలవలేదో.. డ్రోన్లు ఎందుకు పంపిణీ చేయడం లేదో అంతపట్టని పరిస్థితి. దీనిపై వ్యవసాయ అధికారులను ఆరా తీస్తే, డ్రోన్లకు సంబంధించిన ఫైలు ఓ ఉన్నతాధికారి వద్ద పెండింగ్‌లో ఉందని చెప్తున్నారు. మొదటి సంవత్సరం సరఫరా చేసిన డ్రోన్లు సక్రమంగానే పని చేస్తున్నాయని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్తున్నారు. మరి రెండో ఏడాది ఈ పథకం అమలులో ఎందుకు జాప్యం జరుగుతుందో ఎవ్వరూ చెప్పడం లేదు.


హామీ ఇచ్చి..

2026-27లో రూ.90.4కోట్లతో 1,130డ్రోన్లు ఇస్తామని గత ఫిబ్రవరిలో వ్యవసాయ బడ్జెట్‌లో ప్రకటించారు. డ్రోన్ల లబ్ధిదారుల జాబితాలు సిద్ధమయ్యాయని చెప్తున్నా.. అసలు డ్రోన్లు ఎందుకు పంపిణీ చేయడం లేదో చెప్పడం లేదు. మొదట డ్రోన్లు సరఫరా చేసిన కంపెనీకే ఈసారి కూడా అవకాశం ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వంలో ఉందని, అయితే క్యాబినెట్‌ ఆమోదంతో ఈ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని చెప్తున్నారు. ఈ విధంగానూ ఫైలు ముందుకు కదటం లేదు. గత ఏడాది డ్రోన్లు ఇప్పటికే పంపిణీ చేయకపోతే.. ఈ ఏడాదివి అసలు ఇస్తారా లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాగు యంత్రాల పంపిణీలోనూ జాప్యం

సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌ పథకం కింద 2025-26కు వ్యవసాయ యంత్ర పరికరాలను కూడా ఇప్పటి వరకు రైతులకు పంపిణీ చేయలేదు. అయితే వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీకి ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేశారు. కానీ లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. గత ప్రభుత్వం వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు ఇవ్వకుండా, అద్దె కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామనడంపై కొందరు అధికార పార్టీ నేతలు, రైతులు అభ్యంతరం చెబుతున్నారు.


డ్రోన్లతో ఖర్చు, సమయం ఆదా

వ్యవసాయంలో ఖర్చు తగ్గించి, పని తేలికగా జరగడంతో పాటు కూలీల కొరత నేపథ్యంలో వ్యవసాయ రంగంలో డ్రోన్‌ టెక్నాలజీ కీలకంగా మారింది. గత ప్రభుత్వంలో డ్రోన్ల పంపిణీకి అన్ని అనుమతులూ వచ్చినా.. రైతులకు సరఫరా జరగలేదు. కూటమి ప్రభుత్వం తొలి ఏడాది రైతుబృందాలకు డ్రోన్లు ఇవ్వగా, వారు క్యాబ్‌ బుకింగ్‌ తరహాలో అద్దె ప్రతిపాదికన తోటి రైతులకు డ్రోన్‌ సేవలు అందిస్తున్నారు. ఊబరైజేషన్‌ ఆఫ్‌ కిసాన్‌ డ్రోన్‌ అనేది రైతులకు బహుళ ప్రయోజనకారిగా మారింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు డ్రోన్‌తో చల్లడం ద్వారా రైతులకు సమయం, కూలీల డిమాండ్‌ తగ్గుతోంది. అందువల్ల ఇప్పటికే డ్రోన్లు తీసుకున్న రైతుబృందాలు సమీప గ్రామాల రైతులకు సైతం అద్దె ప్రాతిపదికన సేవలు అందించి, ఆదాయం పొందుతున్నారు. ఎకరానికి పురుగు మందు పిచికారీకి కూలీలకు రూ.700 దాకా ఇస్తుండగా, కేవలం రూ.300కే డ్రోన్‌ సేవలు అందుతున్నాయి. అందువల్ల కిసాన్‌ డ్రోన్లు వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉండటంతో వీటి కోసం వేలాది మంది రైతులు ఆశిస్తున్నారు.

Updated Date - Apr 15 , 2026 | 05:41 AM