కేంద్ర నిధుల వినియోగంపై నిర్లక్ష్యమెందుకో?
ABN , Publish Date - May 01 , 2026 | 04:24 AM
రైతుల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్ని ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేయాల్సి ఉన్నా.. వ్యవసాయ శాఖ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది..
కిసాన్ డ్రోన్లు, వ్యవసాయ పరికరాల పంపిణీలో తీవ్ర జాప్యం
అమరావతి, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): రైతుల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్ని ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేయాల్సి ఉన్నా.. వ్యవసాయ శాఖ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్రంలో 2025-26 సంవత్సరానికి కిసాన్ డ్రోన్లు, వ్యక్తిగత వ్యవసాయ పరికరాల పంపిణీకి సంబంధించిన నిధుల్ని మార్చిలోపే వినియోగించాల్సి ఉంది. ఆవిధంగా జరక్క రైతులకు నష్టం జరుగుతోంది. ముఖ్యంగా కిసాన్ డ్రోన్ల విషయంలో కేంద్రం వాటా నిధులు మురిగిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిసింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు లబ్ధి చేకూరేలా ప్రతి పథకాన్ని వినియోగించాలని సీఎం చంద్రబాబు పదేపదే చెప్తున్నారు. కానీ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల అలసత్వం కారణంగా కిసాన్ డ్రోన్లకు సంబంధించి, కేంద్రం వాటా నిధులు రూ.52 కోట్లు మురిగిపోయాయో.. ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఉంది. కిసాన్ డ్రోన్లు, వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో జాప్యంపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘కిసాన్ డ్రోన్లు ఇక ఇంతేనా?’ కథనంపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ స్పందించారు. అయితే డ్రోన్లు సరఫరాదారులను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎంపికచేసి, వ్యవసాయ శాఖకు తెలియజేస్తారని మాత్రమే వివరణ ఇచ్చారు. అలాగే వ్యవసాయ యంత్ర పరికరాల లబ్ధిదారులను త్వరలో ఎంపికచేసి, పంపిణీ చేస్తామని మాత్రమే పేర్కొన్నారు.