Share News

కొత్త ఆలోచనలకు నజరానా

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:32 AM

యువత వినూత్న ఆలోచనలకు ప్రతిరూపమిచ్చి మరింత మెరుగుపర్చేందుకు రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌(ఆర్‌టీఐహెచ్‌)-మంగళగిరి మరో ముందడుగు వేసింది.

కొత్త ఆలోచనలకు నజరానా

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): యువత వినూత్న ఆలోచనలకు ప్రతిరూపమిచ్చి మరింత మెరుగుపర్చేందుకు రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌(ఆర్‌టీఐహెచ్‌)-మంగళగిరి మరో ముందడుగు వేసింది. ఇందుకోసం మంగళగిరిలో ప్రత్యేక ల్యాబ్‌ సిద్ధం చేస్తోంది. అడ్వాన్స్‌డ్‌ ప్రోటో టైపింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌(ఏపీఐసీ ల్యాబ్స్‌) ఏర్పాటుకు దిగ్గజ కార్ల కంపెనీ కియా, ఆర్‌టీఐహెచ్‌ సోమవారం అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కియా-ఇండియా పీఏఓ టయ్‌యూన్‌ కిమ్‌తో ఆర్‌టీఐహెచ్‌ సీఈవో ధాత్రిరెడ్డి ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఎంఓయూ ఏడాది పాటు ఉంటుంది. ఆర్‌టీఐహెచ్‌లో లేదా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా కొత్త ఆలోచనలకు ప్రతిరూపాన్ని ఇచ్చినందుకు యువతకు మొత్తం రూ.14 కోట్ల దాకా ఇవ్వనున్నారు. నూతన ఆవిష్కరణలు చేసినవారికి కోటి రూపాయల దాకా ప్రోత్సాహకం అందివ్వనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కియా ఈ మొత్తాన్ని అందజేస్తుంది. ఆర్‌టీఐహెచ్‌, కియా-ఇండియా మధ్య భాగస్వామ్య ఒప్పందం మేరకు ప్రపంచ స్థాయి సదుపాయాలతో ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర పెట్టుబడులలో ప్రతిష్ఠాత్మక సంస్థగా ఉన్న కియా-ఇండియా ఔత్సాహిక యువతకు సాంకేతిక నైపుణ్యాభివృద్ధిలో అవగాహన కల్పించనుంది. అలాగే, జాతీయ స్థాయిలో ప్రఖ్యాత ఐఐటీలలో ఉన్న ల్యాబ్‌ల తరహాలోనే మంగళగిరిలోని ఆర్‌టీఐహెచ్‌లోనూ ఒక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తారు.

Updated Date - Jun 02 , 2026 | 05:32 AM