కుమారుడిని ఉన్నత విద్య చదివించాలని వెళుతూ.. తిరిగిరాని లోకాలకు దంపతులు
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:46 AM
తమ ఒక్కగానొక్క కుమారుడికి ఉన్నత విద్య చెప్పించి ప్రయోజకుడిని చేయాలని కలలు కన్నారు ఆ దంపతులు... కానీ వారి కలలు కల్లలయ్యాయి... అతడిని ఇంటర్‌లో చేర్చేందుకు హైదరాబాద్ బయల్దేరగా..
కారును ఢీకొట్టిన లారీ.. అనంతరం రెండు లారీల మధ్య నలిగిన కారు
ఖమ్మం జిల్లా కొణిజర్ల వద్ద ఘోర ప్రమాదం
కొణిజర్ల, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): తమ ఒక్కగానొక్క కుమారుడికి ఉన్నత విద్య చెప్పించి ప్రయోజకుడిని చేయాలని కలలు కన్నారు ఆ దంపతులు... కానీ వారి కలలు కల్లలయ్యాయి... అతడిని ఇంటర్‌లో చేర్చేందుకు హైదరాబాద్ బయల్దేరగా మార్గం మధ్యలోనే వారిని మృత్యువు కబళించింది... వారు ప్రయాణిస్తున్న కారును, దాని వెనుక వస్తున్న లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో వీరి కారు రెండు లారీల మధ్య నలిగిపోయింది. దీంతో ఆ దంపతులు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో కన్నుమూశారు. వారి కుమారుడు, ఢీకొన్న లారీ డ్రైవర్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో సాగర్‌కాల్వ వంతెన వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ సూరజ్ తెలిపిన వివరాలివీ.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్ దగ్గరలోని గాదాలమ్మనగర్‌కు చెందిన ఉండమట్ల వీర్రాజు(46), ఉండమట్ల వీరశైలజ(36) దంపతులు తమ కుమారుడు యశ్వంత్‌ను హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్‌లో చేర్చేందుకు ఆదివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో తమ స్వస్థలం నుంచి కారులో బయల్దేరారు. సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో కొణిజర్ల దాటిన తర్వాత సాగర్‌కాల్వ వంతెన వద్ద ఖమ్మం వైపు నుంచి వైరా వైపు వెళుతున్న ఖాళీ లారీ వీరి కారును ఢీకొట్టింది. అనంతరం కారు వెనుక వస్తున్న మరో లారీని కూడా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కారు రెండు లారీల మధ్య నలిగింది. దాంతో కారు నడుపుతున్న వీర్రాజు, పక్కన ఉన్న వీరశైలజ, యశ్వంత్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొట్టిన లారీ డ్రైవర్ అలుగోలు శ్రీను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీర్రాజు తీవ్రగాయాలతో కారులో, లారీ డ్రైవర్ శ్రీను క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వీర్రాజు, వీరశైలజ దంపతులు మృతి చెందగా.. వారి కుమారుడు యశ్వంత్, లారీ డ్రైవర్ శ్రీను చికిత్స పొందుతున్నారు. మృతుడు వీర్రాజు రాజమహేంద్రవరం మండలం ధవళేశ్వరం పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.