కారుణ్యం దుర్వినియోగం
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:46 AM
కారుణ్య నియామకాల విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సానుభూతిని అడ్డం పెట్టుకుని నియామక ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్లుందని పేర్కొంది.
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కంటే ఎక్కువ నియామకాలా!
3 నెలల్లో కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి
మృతి చెందిన ఉద్యోగిపై ఆధారపడిన వారి ఆర్థిక స్థితిని
వారికిచ్చే పరిహారం, ఉపాధి కల్పన అంశాలనూ పరిగణించాలి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
కారుణ్య నియామకాల్లో మూడో తరం వారూ ఉన్నారు
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సానుభూతిని అడ్డంపెట్టుకుని
నియామక ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్లుంది
కారుణ్య నియామకాల విషయంలో హైకోర్టు కీలక తీర్పు
అమరావతి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): కారుణ్య నియామకాల విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సానుభూతిని అడ్డం పెట్టుకుని నియామక ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్లుందని పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పులకు అనుగుణంగా కారుణ్య నియామకాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మృతిచెందిన ఉద్యోగిపై ఆధారపడిన వారి ఆర్థిక సామర్థ్యం, కారుణ్య నియామకానికి బదులుగా ఇచ్చే ఎక్స్‌గ్రేషియా, ఔట్‌సోర్సింగ్/తాత్కాలిక/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉపాధి కల్పన.. వంటి అంశాలను మార్గదర్శకాలలో స్పష్టంగా నిర్వచించాలని పేర్కొంది. తీర్పు ప్రతి అందిన మూడు నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత నూతన మార్గదర్శకాలకు లోబడి కారుణ్య నియామకం కోసం పిటిషనర్ చేసుకున్న దరఖాస్తును పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్పు ప్రతిని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శికి పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఇటీవల తీర్పు ఇచ్చారు.
నియామకాల సంఖ్యపై విస్మయం
లైబ్రరీ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 2022 డిసెంబరులో మరణించిన గోగుతట్టు పెంచలయ్య కుమార్తె సుజన.. కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ 2025లో హైకోర్టును ఆశ్రయించారు. వాదనల అనంతరం వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. రాష్ట్ర విభజన తర్వాత కారుణ్య నియామకాల సంఖ్య అసాధారణంగా ఉండడంపై విస్మయం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు అతని కుటుంబసభ్యులకు కల్పించే కారుణ్య నియామకం ఒక మినహాయింపు మాత్రమే. అది హక్కు కాదు. ఆ మినహాయింపు ప్రస్తుతం ఓ సాధారణ అంశంలా మారిపోయింది. ఏటా సగటున 2,000 చొప్పున జరుగుతున్న కారుణ్య నియామకాలు.. ప్రభుత్వం ప్రతీ ఏడాది చేపట్టే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో సమానంగా, అంతకంటే ఎక్కువుగా ఉన్నాయి. మినహాయింపు పేరుతో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు రాజ్యాంగం ఇచ్చిన సమాన ఉపాధి హక్కును ఉల్లంఘిస్తున్నాయి. విచక్షణారహితమైన కారుణ్య నియామకాలతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న యువత ఆశలను చిదిమేస్తున్నారు. కారుణ్య నియామకాల జాబితాను పరిశీలిస్తే... అందులో ఒకే కుటుంబానికి చెందిన మూడవ తరం వ్యక్తులు కూడా ఉన్నారు. కారుణ్య నియామకాల విషయంలో అభ్యర్థి పని సామర్థ్యాన్ని పరీక్షించే సరైన విధానం ఏదీ లేదు. నియామకాల సంఖ్యను చూస్తుంటే సానుభూతిని అడ్డం పెట్టుకొని నియామక ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టమౌతోంది. ఉద్యోగి మరణించడానికి ముందు ఎవరైతే ఆయన సంపాదనపై ఆధారపడి జీవిస్తారో వారే కారుణ్య నియామకానికి అర్హులు. దీని ప్రకారం.. భార్య, కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రులు మాత్రమే ‘ఆధారపడి జీవించేవారు’ అనే నిర్వచనం పరిధిలోకి వస్తారు. ఉద్యోగం పొందే ఉద్దేశంతో సోదరులు, సోదరీమణులు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు కూడా ఆధారపడి జీవించేవారిగా క్లెయిమ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డిపెండెంట్‌ను నిర్ధారించేందుకు కఠిన నిబంధనలు రూపొందించాలి. కారుణ్య నియామకాల విషయంలో మరణించిన ఉద్యోగి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందా..? లేదా..? అనే విషయాన్ని ప్రధానంగా చూడాలని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది. 2017లో సాధారణ పరిపాలన శాఖ జారీచేసిన జీవో 114 ప్రకారం నిర్ణయించిన స్థిరమైన ఎక్స్‌గ్రేసియా ఏళ్ల తరబడి పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా లేదు. మరణించిన ఉద్యోగి చివరి జీతం, మిగిలి ఉన్న సర్వీసు కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఎక్స్‌గ్రేసియా లెక్కించాలి. ఒకవేళ కుటుంబంలోని అర్హులకు ఉద్యోగం ఇవ్వడం తప్పనిసరైతే శాశ్వత ఉద్యోగానికి బదులు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా ఉపాధి కల్పించవచ్చు. దీనివల్ల సమాన ఉపాధి హక్కుకు భంగం కలగదు. కారుణ్య ప్రాతిపదికన రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వడమనేది అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే జరగాలి. ఇది పూర్తిగా ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నాం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
కారుణ్య నియామకం కోరుతూ కోర్టుకు..
తిరుపతి జిల్లా, పెళ్లకూరు మండలం, పెన్నేపల్లి గ్రామానికి చెందిన గోగుతట్టు పెంచలయ్య లైబ్రరీ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 2022 డిసెంబరులో మరణించారు. పెంచలయ్య ఏకైక కుమార్తె, అప్పటికి వివాహమైన సుజన కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ 2025లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వివాహమైన కుమార్తెలను కూడా కారుణ్య నియామకాలకు పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంటూ.. అందుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, తీర్పులను కోర్టు ముందు ఉంచారు. పిటిషనర్, ఆమె భర్త నిరుద్యోగులని, తండ్రి జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారని కోర్డు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... వివాహం తర్వాత కూడా తండ్రిపై ఆధారపడ్డామని నిరూపించేందుకు పిటిషనర్ ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదన్నారు. ఉద్యోగానికి బదులుగా ఎక్స్‌గ్రేసియా అందించే విధానాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం జీవో 114 జారీ చేసిందన్నారు. కాగా.. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో జరిపిన కారుణ్య నియామకాల వివరాలను సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కోర్టు ముందుంచారు. మొత్తం 20,801 కారుణ్య నియామకాలు జరగగా ఇందులో 20,605 మంది సర్వీసులో కొనసాగుతున్నారని నివేదించారు.