Share News

అవును.. తప్పు చేశాం!

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:16 AM

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమార్కులు ఓ టాప్‌ సైంటిస్టును కూడా ప్రలోభాలకు గురిచేశారు. తిరుమలలో దర్శనాలు, వసతి ఏర్పాట్లలో ప్రొటోకాల్‌ మర్యాదలు చేసి బుట్టలో వేసుకున్నారు.

అవును.. తప్పు చేశాం!

  • కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్లుగా మారిన ముగ్గురు

  • నిందితుల్లో డెయిరీ ఎక్స్‌పర్ట్‌ సురేంద్రనాథ్‌

  • ప్రొటోకాల్‌ దర్శనాలు, మర్యాదలతో వల

  • మర్యాదలకు మురిసి తప్పు చేశానని విలవిల

  • కోర్టులో నేరం అంగీకరించిన టాప్‌ సైంటిస్ట్‌

  • రసాయనాల సరఫరా వ్యాపారి, భోలేబాబా డెయిరీ ఉద్యోగి సైతం నేరాంగీకారం

తిరుపతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమార్కులు ఓ టాప్‌ సైంటిస్టును కూడా ప్రలోభాలకు గురిచేశారు. తిరుమలలో దర్శనాలు, వసతి ఏర్పాట్లలో ప్రొటోకాల్‌ మర్యాదలు చేసి బుట్టలో వేసుకున్నారు. వారి మర్యాదలకు మురిసిపోయి కల్తీ నెయ్యి వ్యవహారంలో డెయిరీలకు సహకరించినట్టు కోర్టు ఎదుట ఆయన అంగీకరించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డెయిరీ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ బత్తల సురేంద్రనాథ్‌ గత డిసెంబరు మొదటి వారంలో కోర్టు ముందు హాజరయ్యారు. నేరాంగీకారంతో పాటు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వెల్లడించారు. నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించి బెంగళూరులోని రీజనల్‌ సెంటర్‌లో కెమిస్ట్రీ విభాగానికి అధిపతిగా పనిచేసిన సురేంద్రనాథ్‌ ఐదేళ్ల కిందట రిటైరయ్యారు. 2013 నుంచీ టీటీడీకి నెయ్యి కొనుగోలు విషయంలో సలహాలు, సూచనలు, అవసరమైన నివేదికలిస్తూ సహకరించారు. టెండర్లలో పాల్గొనే డెయిరీలను, ప్లాంట్లను తనిఖీ చేసి, వాటి నెయ్యి తయారీ సామర్థ్యం పరిశీలించి టీటీడీకి నివేదికలు ఇచ్చేవారు. అందులో భాగంగా టీటీడీ నియమించిన ప్లాంట్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీలో నెయ్యి నిపుణుడి హోదాలో సభ్యుడుగా పనిచేశారు. డెయిరీ టెక్నాలజీ ముఖ్యంగా నెయ్యికి సంబంధించి దేశంలోని అత్యున్నత స్థాయి సైంటిస్టుల్లో సురేంద్రనాథ్‌ కూడా ఒకరు. ఆయనకు టీటీడీలో కేవలం మార్కెటింగ్‌ జీఎం, ఈవో మినహా మరెవ్వరూ తెలియదని సమాచారం. నేరుగా వారిద్దరితోనే మాట్లాడడం, కలవడం చేసేవారని సమాచారం. గత టీడీపీ ప్రభుత్వంలో నెయ్యి సరఫరా, తనిఖీల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేవారు. సురేంద్రనాథ్‌పై అప్పుడు ఎలాంటి ఆరోపణలూ లేవు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కథ మారింది.


టీటీడీ పనుల మీద తాను ఎప్పుడు తిరుపతి వచ్చినా ఎయిర్‌పోర్టులో దిగగానే టీటీడీ వాహనం మొదలుకుని తిరుమలలో గెస్ట్‌హౌస్‌ కేటాయింపు, శ్రీవారి దర్శనం వరకూ ప్రొటోకాల్‌ మర్యాదలతో ఏర్పాటు చేయించేవారని ఆయన కోర్టు ముందు వెల్లడించారు. తిరుమలలో కష్టసాధ్యమైన ప్రొటోకాల్‌ దర్శనాలు, మర్యాదలు దక్కుతుండడంతో కేవలం వాటికి ముగ్ధుడినై నెయ్యి సరఫరా విషయంలో సహకరించానని కోర్టుకు వివరించారు. ఈ వాస్తవాలు వెల్లడించే క్రమంలో తప్పు చేశానంటూ కోర్టు ముందు భోరున విలపించినట్టు సమాచారం. తాను పనిచేసిన సంస్థలో నెలకు రూ.3 లక్షల వేతనం అందేదని, తాను డబ్బు కోసం తప్పు చేయలేదని చెప్పారు. కేవలం దర్శనాలు, వసతి ఏర్పాట్లలో ప్రొటోకాల్‌ మర్యాదలకు మురిసి సహకరించానని వాపోయినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో నెయ్యి సరఫరా వ్యవహారంలో ఏం జరిగిందన్నది కోర్టుకు వివరించారు. తనిఖీల సందర్భంగా డెయిరీలకు పాల ఉత్పత్తి, నెయ్యి తయారీ సామర్థ్యం లేకపోయినా బాగున్నట్టుగా నివేదికలు ఇచ్చినట్టుగా చెప్పినట్టు తెలుస్తోంది.


మరో ఇద్దరు నేరాంగీకారం

కల్తీ నెయ్యి కేసులో ఇప్పటి దాకా ముగ్గురు నిందితులు అప్రూవర్లుగా మారారు. కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సిట్‌ దాఖలు చేసిన తుది చార్జిషీట్‌లో నిందితుల జాబితాలో 36 పేర్లు ఉన్నాయి. అందులో 5 పేర్లు డెయిరీ సంస్థలవి. మిగిలిన 31 మంది నిందితులలో ముగ్గురు అప్రూవర్లుగా మారారు. వారిలో డెయిరీ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ బత్తల సురేంద్రనాథ్‌తో పాటు ఏ14 ఆశిష్‌ రోహిలా, ఏ17 మహేశ్‌ కుమార్‌ రోహిరా ఉన్నారు. వేర్వేరు సందర్భాలలో ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట హాజరై తాము తప్పు చేసినట్టు అంగీకరించారు. తమకు తెలిసినంత మేరకు వివరాలు కూడా కోర్టుకు వెల్లడించారు. ఏ14 ఆశిష్‌ రోహిలా ఉత్తరాఖండ్‌లోని భగవాన్‌పూర్‌లో ఉన్న భోలేబాబా డెయిరీలో ఉద్యోగి. అతడు పనిచేసిన కాలంలో భోలేబాబా డెయిరీలో కల్తీ నెయ్యి దందాకు సంబంధించి ఏమేం జరిగిందీ మొత్తం పూసగుచ్చినట్టు కోర్టుకు వివరించాడు. ఎక్కడెక్కడి నుంచి ఏయే రసాయనాలు, ఇతర పదార్థాలు ఎంతెంత పరిమాణంలో వచ్చాయి, వాటితో కల్తీ ఎలా జరిగిందీ వంటి వివరాలన్నింటినీ కోర్టుకు తెలియజేశాడు. ఇక ఏ17 మహేశ్‌ కుమార్‌ రోహిరా రసాయనాలు సరఫరా చేసే వ్యాపారి. అతడు కూడా భోలేబాబా డెయిరీకి తాను సరఫరా చేసిన రసాయనాలు, వాటి పరిమాణం, దానికోసం జరిపిన నగదు లావాదేవీలు వంటి వివరాలన్నింటినీ కోర్టు ముందు తప్పు చేసినట్టు ఒప్పుకొన్నాడు.

Updated Date - Feb 05 , 2026 | 08:08 AM