Share News

మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో..ప్రధాన నిందితుల అరెస్టు

ABN , Publish Date - Mar 19 , 2026 | 05:13 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో సీఐడీ వేగం పెంచింది. ఈ కేసులో కీలక నిందితులైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వంకిరెడ్డి....

మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో..ప్రధాన నిందితుల అరెస్టు

  • మాధవరెడ్డి, మునితుకారాంను అదుపులోకి తీసుకున్న సీఐడీ

తిరుపతి(నేరవిభాగం), మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో సీఐడీ వేగం పెంచింది. ఈ కేసులో కీలక నిందితులైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వంకిరెడ్డి మాధవరెడ్డి(ఏ3), ఆయన పీఏ ముని తుకారాం(ఏ4)లను బుధవారం అరెస్టు చేసింది. మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌ కార్యాలయంలో 2024 జూలై 21వ తేదీ రాత్రి జరిగిన ఫైళ్ల దహనానికి సంబంధించి మదనపల్లె టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. మాధవరెడ్డిని ఇప్పటికే ఒకసారి అరెస్టు చేయగా.. కేసుకు సంబంధించిన పత్రాలు సక్రమంగా లేవంటూ అప్పట్లో చిత్తూరు సీఐడీ కోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. తర్వాత మాధవరెడ్డి తదితరులు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. రికార్డు రూంలో మంటలెలా వచ్చాయి.. దీని వెనుక ఉన్న ప్లాన్‌ ఏమిటో పోలీసులు లోతుగా విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అప్పటి నుంచీ పరారీలో ఉన్న మాధవరెడ్డితో పాటు మునితుకారాం కదలికలపై సీఐడీ అధికారులు కొద్దిరోజులుగా నిఘాపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం చిత్తూరు వైపు వెళ్తూ కాఫీ తాగేందుకు ఆగిన వీరిద్దరినీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో చంద్రగిరి మండలం పనపాకం టోల్‌ప్లాజా వద్ద సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్‌ నేతృత్వంలోని బృందం అదుపులోకి తీసుకుంది. తిరుపతిలోని సీఐడీ కార్యాలయానికి తరలించి వేర్వేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, ఫైళ్ల దహనం కేసులో ఏ1 జి.గౌతమ్‌తేజ్‌నాయుడు (అప్పటి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌) ఇదివరకే అరెస్టయి సస్పెండయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఏ2 ఎం.ఎ్‌స.మురళి (అప్పటి మదనపల్లె ఆర్డీవో) కూడా బెయిల్‌పై బయటకు వచ్చారు. మిగిలిన నిందితులైన మాజీ ఎమ్మెల్యే ఎం.నవాజ్‌బాషా, జింకా వెంకటాచలపతి, శశికుమార్‌, రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. మరో పూర్వ ఆర్డీవో హరిప్రసాద్‌పై కేసు నమోదైనా అరెస్టు కాలేదు. ఇటీవల ఉద్యోగంలో కూడా చేరారు. ఇప్పుడు మాధవరెడ్డి, బి.మునితుకారాం అరెస్టయ్యారు.

Updated Date - Mar 19 , 2026 | 05:13 AM