కేతిరెడ్డికి వంతపాడారు!
ABN , Publish Date - Mar 07 , 2026 | 06:07 AM
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ ఆక్రమణలకు సహకరించిన తహసీల్దార్లు చిక్కుల్లో పడ్డారు.
ఆయన భూఆక్రమణలపై తప్పుడు నివేదికలు
అప్పటి తహసీల్దార్లు ఇద్దరికి షోకాజ్ నోటీసులు
పది రోజుల్లో వివరణ ఇవ్వాలని సీఎస్ ఉత్తర్వులు
అనంతపురం కలెక్టరేట్/ పుట్టపర్తి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ ఆక్రమణలకు సహకరించిన తహసీల్దార్లు చిక్కుల్లో పడ్డారు. వైసీపీ హయాంలో ధర్మవరం తహసీల్దార్లుగా పనిచేసిన యుగేశ్వరి దేవి, నీలకంఠారెడ్డికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా వారిద్దరూ వ్యవహరించారు. భూ ఆక్రమణలకు, ధర్మవరం చెరువు ఆక్రమణలకు సహకరించారు. దీనిపై తుంపర్తి గ్రామానికి చెందిన పరమేశ్ బలిగొల్ల అనే వ్యక్తి చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 904, 904-బి, 904-సి, 905-2, 908-1, 909-1, 909-2లోని కొండప్రాంతం, సర్వే నం.661లోని ధర్మవరం చెరువులో 20 ఎకరాలను వెంకటరామిరెడ్డి ఆక్రమించారని ఆరోపించారు. ఆ భూముల్లో ఫాంహౌస్, గుర్రపుశాలలు, బోటింగ్, రేస్ కోర్సులు తదితరాలను నిర్మించారని తెలిపారు. విచారణలో భాగంగా జిల్లా కలెక్టర్‌కు అప్పటి ధర్మవరం ఇన్‌చార్జి తహసీల్దారు యుగేశ్వరి దేవి తప్పుడు నివేదిక ఇచ్చారు. కేతిరెడ్డి నిర్మించిన ఫాంహౌస్ సర్వే నం.904లో ఉందని, అది ధర్మవరం చెరువులో లేదని నివేదిక ఇచ్చారు. ధర్మవరం చెరువు సర్వే నం. 661-1తో ఉందని, యర్రగుడ్డం కొండకు సమీపంలోని ధర్మవరం చెరువులో 20 ఎకరాల భూమి ఆక్రమణకు గురికాలేదని నివేదిక సమర్పించారు. ఆ తరువాత ధర్మవరం ఆర్డీఓ నిర్వహించిన విచారణలో సర్వే నం. 904, పాత సర్వే నం. 661-1 నుంచి బ్లాక్‌గా విభజించినట్లు గుర్తించారు. దీంతో కేతిరెడ్డి నిర్మించిన ఫాంహౌస్ ధర్మవరం చెరువులోనే ఉందని తేలింది. సర్వే నం.904 అసైన్‌మెంట్‌కు సంబంధించి రికార్డులు అందుబాటులో లేవని వెల్లడైంది. దీంతో యుగేశ్వరి దేవి విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని గుర్తించిన ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మ్యుటేషన్‌లో అక్రమాలు
ధర్మవరంలో తహసీల్దారుగా పనిచేసిన నీలకంఠారెడ్డి వెబ్‌ల్యాండ్ రికార్డులతో కార్యాలయ రికార్డులను సరిచూడకుండానే మ్యుటేషన్లు/ఎంట్రీలు చేశారు. సర్వే నం. 905-2లోని 2.42 ఎకరాల అసైన్డ్ భూమిని గాలి వసుమతి (కేతిరెడ్డి తమ్ముడి భార్య) పేరిట నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేశారు.
యువగళం పాదయాత్రలో వెలుగులోకి
అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధర్మవరంలోని చిక్కవడియార్ చెరువు పక్కన గుట్టపై ఫాంహౌస్ నిర్మించారు. అప్పటిదాకా యర్రగుడ్డం కొండగా పిలిచే ఆ ప్రాంతం, గుర్రాల కోటగా మారిపోయింది. ఈ అక్రమాలన్నీ లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో వెలుగులోకి వచ్చాయి. చెరువు కబ్జా గురించి లోకేశ్ అప్పట్లో బహిరంగ ఆరోపణలు చేశారు.