విరుచుకుపడ్డ మృత్యువు
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:28 AM
మృత్యువు ఏ వైపు నుంచి దూసుకొస్తుందో ఎవరికీ తెలియదు! తన తప్పు లేకున్నా.. ఎదుటి వారు చేసే తప్పులకు బలయ్యే వారు ఎంత మందో!! ఆ తరహాలోనే జరిగిన రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు (55)ను బలి తీసుకుంది.
టోల్‌గేట్ వద్ద ఆగిన కారుపై బోల్తా పడిన భారీ ట్యాంకర్
హైకోర్టు న్యాయవాది శ్రీనివాసరావు దుర్మరణం
కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
వెనుక నుంచి వేగంగా వచ్చి.. డివైడర్‌ను ఎక్కి.. పక్కనున్న కారుపై పడ్డ ఫ్లైయాష్ ట్యాంకర్
కారు నుజ్జునుజ్జు.. డ్రైవర్ సీట్లోనే అడ్వకేట్ మృతి
విజయవాడ/కంచికచర్ల, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): మృత్యువు ఏ వైపు నుంచి దూసుకొస్తుందో ఎవరికీ తెలియదు! తన తప్పు లేకున్నా.. ఎదుటి వారు చేసే తప్పులకు బలయ్యే వారు ఎంత మందో!! ఆ తరహాలోనే జరిగిన రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు (55)ను బలి తీసుకుంది. టోల్‌బూత్ వద్ద ఆయన కారు ఆగి ఉండగా.. వెనుక నుంచి సిమెంట్ ఫ్లైయాష్ లోడ్‌తో వేగంగా వచ్చిన ఓ లారీ ట్యాంకర్ అదుపుతప్పి పైన పడింది. దీంతో ఆ కారు నుజ్జునుజ్జు కావడంతో.. అందులో ఉన్న న్యాయవాది శ్రీనివాసరావు డ్రైవర్ సీట్లోనే దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్న న్యాయవాది శ్రీనివాసరావు శుక్రవారం జరిగిన ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ఓటేసేందుకు తన బీఎండబ్ల్యూ కారులో విజయవాడ వచ్చారు. పని ముగిసిన అనంతరం ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి పయనమయ్యారు. సాయంత్రం 4 గంటలకు కీసర టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న ఆయన.. విజయవాడ-హైదరాబాద్ మార్గంలోని మూడో లైన్ టోల్‌బూత్ వద్దకు వెళ్తున్నారు. ముందు ఓ కారు ఆగడంతో శ్రీనివాసరావు తన బండిని దాని వెనుక ఆపారు.
ఈ క్రమంలో ఏపీ39వీ 9789 నంబరు గల లారీ ట్యాంకర్ ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ నుంచి సిమెంట్ ఫ్లైయాష్ తీసుకుని జగ్గయ్యపేటలోని సిమెంట్ కర్మాగారానికి వెళ్తోంది. ఆ లారీకి తమిళనాడుకు చెందిన ఆంటోని జేవియర్ అనే వ్యక్తి డ్రైవర్‌గా ఉన్నాడు. టోల్‌ప్లాజా వద్ద బండిని అతివేగంగా తీసుకురావంతో రెండో లైన్‌లోకి వెళ్లాలా? మూడో లైన్‌లోకి వెళ్లాలా? అనే విషయంలో గందరగోళానికి గురయ్యాడు. ఈ క్రమంలో మూడో లైన్‌లోకి ట్యాంకర్‌ను తీసుకొచ్చాడు. వేగం నియంత్రణ కాకపోవడంతో టోల్‌బూత్‌లకు మధ్యన ఉండే డివైడర్‌పైకి ట్యాంకర్‌ను ఎక్కించాడు. ఆ సమయంలో ముందున్న న్యాయవాది శ్రీనివాసరావు కారును ఢీ కొడతానన్న కంగారులో.. డివైడర్‌ను ఎక్కించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత అక్కడ బూత్ ముందున్న ఓ కాంక్రీట్ దిమ్మను ఢీకొనడంతో ట్యాంకర్ ఒక్కసారిగా ఒరిగిపోయి కారుపై పడింది. 70-80 టన్నుల బరువున్న ట్యాంకర్ బోల్తా పడడంతో కారు నుజ్జునుజ్జు అయింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న శ్రీనివాసరావు కూర్చున్న స్థితిలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఐదు క్రేన్లకూ అలవికాని ట్యాంకర్
ప్రమాదం జరిగిన వెంటనే టోల్‌ప్లాజా సిబ్బంది రెండు క్రేన్లతో రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ట్యాంకర్‌ను పైకి లేపేందుకు వీటి సామర్థ్యం సరిపడకపోవడంతో మరో మూడు క్రేన్లను రప్పించారు. ఈ ఐదు క్రేన్లు కూడా ట్యాంకర్‌ను పైకి లేపలేకపోయాయి. ట్యాంకర్ బరువుకు ఈ క్రేన్లు కూడా పైకి లేచిపోయాయి. దీంతో క్రేన్లు పైకి లేవకుండా వాటిపైకి జనాలను ఎక్కించారు. అయినా ట్యాంకర్‌ను పైకి లేపడం సాధ్యం కాదని గ్రహించిన పోలీసులు దాన్ని ఓ పక్కకు జరిపించారు. గంటన్నరపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ట్యాంకర్‌ను పక్కకు తీసిన తర్వాత కారులో నుంచి శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటకు తీసి అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ జేవియర్‌పై కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు పరిశీలించారు. ట్యాంకర్ నుంచి డీజిల్ బయటకు రావడంతో ముందస్తు జాగ్రత్తగా మూడు అగ్నిమాపక వాహనాలను టోల్‌ప్లాజా వద్ద అందుబాటులో ఉంచారు.
పేదల పక్షపాతి, సౌమ్యుడు..
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావు హైకోర్టు అడ్వకేట్‌గా మంచి పేరు గడించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వి.ఆదినారాయణరావు వద్ద జూనియర్‌గా పనిచేసిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత అధిక భాగం ఏపీ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు. దాదాపు గత 30 ఏళ్లుగా హైదరాబాద్‌లో అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలోని మూర్తి ఎన్‌క్లేవ్‌లో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరావుకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన న్యాయం వైపు ఉంటారని, కేసులు వాదించేటప్పుడు ఫీజుల కోసం కక్షిదారులను ఒత్తిడి చేయరని, పేదల పక్షపాతిగా, సౌమ్యుడిగా, ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారనే పేరుంది. న్యాయవాది శ్రీనివాసరావు అమరావతిలో కొత్తగా కార్యాలయాన్ని నిర్మించుకునే పనిలో ఉన్నారు. అతని స్నేహితుడు, బిల్డర్ నిమ్మగడ్డ కృష్ణమోహన్ ఆ బాధ్యతలు చూస్తున్నారు. కాగా, శ్రీనివాసరావు మరణంపై పలువురు తోటి న్యాయవాదులు దిగ్ర్భాంతి చెందారు. పేరొందిన అడ్వకేట్ మృతిచెందటం బాధాకరమని సీపీ రాజశేఖర్‌బాబు విచారం వెలిబుచ్చారు.