Share News

జిల్లా సమైక్య నిధులపై కన్ను!

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:59 AM

జిల్లా సమైక్య నిధులపై కొందరు సమైక్య సభ్యులు, అధికారుల కన్ను పడిందని విమర్శలు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో సమైక్య పాలకవర్గం లేకపోయినా నిధులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిధుల విషయమై ఇటీవల జిల్లా అధికారులకు సమైక్య పూర్వ అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సమైక్య నిధులు ఏమవుతాయోనని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు.

జిల్లా సమైక్య నిధులపై కన్ను!

- పదేళ్ల కిందట రూ.89 లక్షలు డి పాజిట్‌

- ప్రస్తుతం కోటి రూపాయలు దాటిన నిధులు

- రెండేళ్ల కిందట జిల్లా సమైక్య పదవీకాలం పూర్తి

- పలువురు సభ్యులు, డీఆర్‌డీఏ అధికారులతో నడుస్తున్న కార్యకలాపాలు

- ఇష్టానుసారంగా తీర్మానాలు చేసి నిధులు డ్రా చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు

- సమైక్య నిధులు కాపాడాలని సభ్యుల వేడుకోలు

జిల్లా సమైక్య నిధులపై కొందరు సమైక్య సభ్యులు, అధికారుల కన్ను పడిందని విమర్శలు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో సమైక్య పాలకవర్గం లేకపోయినా నిధులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిధుల విషయమై ఇటీవల జిల్లా అధికారులకు సమైక్య పూర్వ అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సమైక్య నిధులు ఏమవుతాయోనని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

డీఆర్‌డీఏ కార్యాలయాన్ని వివాదాలు వీడటం లేదు. గత రెండేళ్లుగా జిల్లా సమైక్య పాలకవర్గం మనుగడలో లేకున్నా సమైక్య నిధులను మాత్రం యథేచ్ఛగా ఖర్చు చేసేస్తున్నారు. నగదును ఎందుకు విడుదల చేస్తున్నారో జిల్లా సమైక్యలో తీర్మానం రాసి, లెక్కలు చూపి సంబంధిత వివరాలను డీఆర్‌డీఏ పీడీ, కలెక్టర్‌కు నివేదించి నిధులు మళ్లించాల్సి ఉంది. కానీ జిల్లాసమైక్య పాలకవర్గం పూర్తిస్థాయిలో లేకున్నా.. కొందరు సభ్యులతోనే ఉన్న పాలకవర్గం ఇష్టానుసారంగా లెక్కలు, తీర్మానాలు రాసి నిధులు వినియోగించడం పలు విమర్శలకు దారి తీస్తోంది.

2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.89 లక్షలు డి పాజిట్‌

ఉమ్మడి జిల్లాగా కొనసాగుతున్న సమయంలో డ్వాక్రా సంఘాల సభ్యులు ఏటా చెల్లించే సభ్వత్వ నమోదు, ఇతరత్రాల రూపంలో సమకూరిన రూ.89 లక్షల నగదును డీఆర్‌డీఏ అధికారులు బ్యాంకులో 2026-17 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్‌ చేశారు. ఈ నగదు వడ్డీతో కలుపుకుని ప్రస్తుతం రూ.1.10 కోట్లకుపైగా అయ్యింది. గతంలో డీఆర్‌డీఏ పీడీలుగా పనిచేసిన అధికారులు ఈ నగదును ముట్టుకోలేదు. ఈ నగదును ఖర్చు చేసేందుకు ఎంత ఒత్తిడి వచ్చినా డిపాజిట్‌ సొమ్మును మాత్రం బ్యాంకు నుంచి డ్రా చేయనివ్వలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారింది.

2024 నుంచి నిధుల కోసం తీర్మానాలు

2022 ఏప్రిల్‌లో జిల్లాల విభజన జరిగింది. ఆ తర్వాత రెండేళ్ల వరకు ఉమ్మడి జిల్లా స్థాయిలో జిల్లా సమైక్య డిపాజిట్‌ నగదు పంపకాలపై అధికారులు మిన్నకుండిపోయారు. 2023లో జిల్లా సమైక్య పాలకవర్గం గడువు ముగిసింది. 2024లో జిల్లా సమైక్య నిధులను జిల్లాల వారీగా పంపకాలు చేయాలని ఉన్న కొద్దిమంది పాలకవర్గసభ్యులు తీర్మానం చేశారు. జిల్లా సమైక్య పాలకవర్గం పూర్తిస్థాయిలో లేకుండా ఈ నిధులను కదిపితే వివాదాలు వస్తాయనే కారణంతో అప్పటి డీఆర్‌డీఏ పీడీ ఈ నిధులను అలానే ఉంచాలని, కలెక్టర్‌, సెర్ఫ్‌ అధికారులతో మాట్లాడి, వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పి నిలిపివేశారు. డీఆర్‌డీఏకు ఆ తర్వాత ఇన్‌చార్జి పీడీలుగా ముగ్గురు పనిచేశారు. వీరి కాలంలోనూ డిపాజిట్‌ చేసిన నగదును పంపకాలు చేసేందుకు ఫైళ్లు పెట్టడం, వారు పూర్తిస్థాయి పీడీ వచ్చిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పి సంబంధిత ఫైళ్లు పక్కనపెట్టేశారు. 2024, 2025 సంవత్సరాల్లో ఈ నిధులను కదపాలని చూసినా సెర్ఫ్‌ అధికారులకు లేఖలు రాసి, వారి నిర్ణయం మేరకు నడుచుకుంటామని పీడీలు చెబుతూ వస్తున్నారు.

ఉన్నతాధికారులకు సమైక్య పూర్వ అధ్యక్షురాలు ఫిర్యాదు

ఇటీవల సెర్ఫ్‌ అసిస్టెంట్‌ సీఈవో మచిలీపట్నంలోని డీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చి ఆర్థిక లావాదేవీలు, ఇతరత్రా అంశాలకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలను పరిశీలించి వెళ్లారు. ఆయన వెళ్లిన కొద్దిరోజులకే జిల్లా సమైక్య నిధులను కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాలకు పంపిణీ చేయాలనే అంశం తెరపైకి తెచ్చారు. జిల్లా సమైక్య పాలకవర్గం సభ్యుల్లో అందరికీ ఈ విషయం చెప్పకుండా కొందరే నిర్ణయం తీసుకుని సమైక్య నిధులను పంపకాలు చేసేందుకు ప్రయత్నించడంతో ఈ అంశంపై జిల్లా సమైక్య పూర్వ అధ్యక్షురాలు మునెమ్మ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొత్తపాలకవర్గం లేకుండా, ప్రస్తుతం ఉన్న సభ్యులకు వివరాలు తెలియజేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ అంశంపై విచారణ చేసి, అనంతరం నిధుల మళ్లింపు చేయాలని ఆమె అధికారులను కోరారు. 2016 నుంచి 2026 వరకు ఈ డిపాజిట్‌లపై ఎంతమేర వడ్డీ రూపంలో వచ్చింది.. ఏయే జిల్లాలకు ఎంతమేర నగదును కేటాయిస్తారో వివరాలు తెలియజేయాలని కూడా ఆమె డిమాండ్‌ చేశారు. ఈ అంశం వివాదాల్లో ఉండగానే ఎన్టీఆర్‌ జిల్లాకు కొంతమేర నగదును ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ఎన్నికలు జరపకుండా వాయిదాలు

జిల్లా సమైక్య పదవీకాలం పూర్తయి రెండేళ్లకుపైగా అవుతోంది. కానీ ఎన్నికలు జరపడం లేదు. గత మార్చి 30వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏప్రిల్‌ 10వ తేదీన నామినేషన్‌ల స్వీకరణ, 11న నామినేషన్‌ల పరిశీలన, 14న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాల ప్రకటన, 18న ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. మండల సమైక్యల అధ్యక్షులు లేకుండానే ఇటీవల సమావేశం నిర్వహించడం, ఈ అంశంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో జిల్లా సమైక్య ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటించలేదు. ఈలోగానే జిల్లా సమైక్యలోని నగదును ఇష్టానుసారంగా చెక్కులు రాసి ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయినా ఇవేమీ లెక్కలోకి తీసుకోకుండా జిల్లాసమైక్యలోని కొందరు సభ్యులు, డీఆర్‌డీఏ అధికారులు తమ చిత్తానుసారంగా నగదును మళ్లించడం, ఇతరత్రాల రూపంలో డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి, పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాతే నగదు లావాదేవీలకు అనుమతులు ఇస్తే బాగుంటుందని డీఆర్‌డీఏలో పనిచేసే కొందరు అధికారులు అంటున్నారు.

Updated Date - Apr 24 , 2026 | 12:59 AM