AP Swachhandra Corporation Chairman: కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్
ABN , Publish Date - Jan 14 , 2026 | 03:29 AM
రెండు పత్రికలు.. రెండు కుటుంబాలు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నాయి. జగన్, కేసీఆర్ పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుట్రలకు తెరదీస్తున్నాయి అని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్...
కుటుంబ పత్రికలతో తెలుగు వారి మధ్య చిచ్చు
ప్రాజెక్టులపై సాక్షిది ఒక మాట, ‘నమస్తే’ది మరో మాట
తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకున్నారంటున్న నమస్తే
తెలంగాణకే నీళ్లు ఇచ్చారంటూ ‘సాక్షి’ కథనాలు
తప్పుడు కథనాలతో ప్రజలను రెచ్చగొడుతున్నాయి
వైసీపీ, బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ పట్టాభిరాం
అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ‘‘రెండు పత్రికలు.. రెండు కుటుంబాలు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నాయి. జగన్, కేసీఆర్ పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుట్రలకు తెరదీస్తున్నాయి’’ అని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సీఎం చంద్రబాబు కోరుకుంటే.. తెలుగు రాష్ట్రాలు సర్వనాశనం కావాలని వైసీపీ, బీఆర్‌ఎస్ కోరుకుంటున్నాయని మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కేసీఆర్, జగన్ కలిసి ఉంటూనే తమ తమ పత్రికల ద్వారా తెలుగు ప్రజల నడుమ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర ప్రాజెక్టులపై నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయి. తెలంగాణ నీటికి చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ నమస్తే తెలంగాణలో రాస్తే... చంద్రబాబు తెలంగాణకు న్యాయం చేస్తున్నారంటూ సాక్షి కథనాలు ప్రచురిస్తోంది. రాయలసీమ లిఫ్టును ఆపింది తామే అని హరీశ్‌రావు చెప్పినట్లు నమస్తే తెలంగాణలో రాస్తే... సీమ లిఫ్టును తానే ఆపించినట్లు రేవంత్‌రెడ్డి అన్నట్లు సాక్షిలో రాస్తారు. నీ రాష్ట్రంలో నీ డ్రామా నీవు ఆడు.. నా రాష్ట్రంలో నా డ్రామా నేను ఆడుతా అంటూ జగన్, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు’’ అని పట్టాభి పేర్కొన్నారు.
ఎన్నికల సమయలో కేసీఆర్, కేటీఆర్‌లు జగన్‌కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పులు, సాగునీటి ప్రాజెక్టులపై నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికల్లో భిన్నంగా వస్తున్న కథనాల క్లిప్పులను పట్టాభి ప్రదర్శించారు. ‘‘16 తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు చేసి అడ్డుకున్నారంటూ నమస్తే తెలంగాణలో కథనం రాశారు. అదే... సాక్షిలో మాత్రం చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదని రాశారు’’అని పట్టాభి ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ హయాంలోనే ఎన్జీటీ ఆపివేసిందని, అప్పుడు జగన్ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్టు పేరుతో పెద్దిరెడ్డి సుమారు వెయ్యు కోట్ల రూపాయలు దోచుకున్నారని, అందుకే మిథున్ రెడ్డి ఆస్తులు అడ్డగోలుగా పెరిగాయని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులు, ప్యాలె్‌సల కోసం జగన్ పనిచేస్తున్నారని విమర్శించారు.