మత్స్య రైతులకు అందని కేసీసీ రుణాలు
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:59 AM
మత్స్య రైతులకు ఆర్థిక చేయూత కోసం కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)ల లక్ష్యం నీరుగారుతోంది.
2025-26లో లక్ష్యం 40 వేల మంది
ఇచ్చింది దానిలో సగం మందికే... 6 వేల దరఖాస్తుల తిరస్కరణ
అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): మత్స్య రైతులకు ఆర్థిక చేయూత కోసం కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)ల లక్ష్యం నీరుగారుతోంది. కేసీసీపై రుణాలిచ్చే బ్యాంకులు కొర్రీలేసి నెలల తరబడి దరఖాస్తులను పెండింగ్ పెడుతున్నాయి. కేసీసీ రుణాలపై పర్యవేక్షణ లేక రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తింది. పూచీకత్తు లేకుండా రూ.2లక్షల వరకు కేసీసీపై రుణాలు ఇవ్వాల్సి ఉంది. చేపల చెరువులు ఉన్న రైతులు, సముద్రంలో వేట సాగించే వారు, పడవలు ఉన్న మత్స్యకారులు.. కేసీసీపై రుణాలకు అర్హులని ఆర్బీఐ స్పష్టం చేసింది. వేటకు అవసరమైన సామాగ్రి ఖర్చులకు ఈ రుణాలు తీసుకోవచ్చు. 2025-26లో ఏపీలో 40,400మంది మత్స్యరైతులు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులకు రుణాలివ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత నవంబరు నాటికి కేవలం 28,218 మందికే రుణాలు మంజూరయ్యాయి. మరో 6వేల దరఖాస్తులను తిరస్కరించారు. తమిళనాడులో మత్స్యరైతులు, మత్స్యకారుల పథకాల అమలుకు సమన్వయ కమిటీలు ఉన్నాయి. అలాగే ఏపీలోనూ లక్ష్యం మేరకు రుణాలిచ్చేలా, రైతులకు అవగాహన కల్పించే కమిటీలు ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.