కేసీ కెనాల్‌కు రబీలోనూ నీరు
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:14 AM
కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో రెండో పంట(రబీ)కూ నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల కష్టాలపై మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు..
జూలై వరకూ తాగు, సాగు నీరిస్తాం: జలవనరుల శాఖ
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో రెండో పంట(రబీ)కూ నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల కష్టాలపై మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జూలై దాకా సాగు, తాగు నీరందిస్తామని జల వనరుల శాఖ శనివారం ప్రకటించింది. ఈ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని రైతాంగానికి విజ్ఞప్తి చేసింది. తుంగభద్ర డ్యామ్‌కు కొత్త గేట్లను అమర్చాల ని కేంద్ర జల సంఘం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో రెండో పంటకు నీరందించలేమని గతంలో చెప్పామని జల వనరుల శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. తుంగభద్ర డ్యామ్‌లో నీటి నిల్వను 80 టీఎంసీలకు పరిమితం చేసినందువల్ల కేసీ కెనాల్ పరిధిలో రెండో పంటకు నీరందించడం సాధ్యం కాదని గతేడాది డిసెంబరు 2న నంద్యాలలో జరిగిన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ప్రకటించింది. అయినప్పటికీ నందికొట్కూరు, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాల రైతులు సుమారు 40,500 ఎకరాల్లో రబీ పంటను వేశారని తెలిపింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు జయసూర్య, గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి గత రెండు రోజులుగా మల్యాల, ముచ్చుమర్రి నుంచి నీరు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడును కోరారని జల వనరుల శాఖ వివరించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలోని నీటి నిల్వలను పరిగణనలోనికి తీసుకుని కేఆర్‌ఎంబీ ద్వారా కేటాయించిన కోటాకు లోబడి సాగు, తాగు నీటిని జూలై వరకూ అందించనున్నట్టు తెలిపింది.