రాజకీయ దిగ్గజం కావూరు ఇక లేరు
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:18 AM
కేంద్ర మాజీ మంత్రి, ‘ప్రోగెస్రివ్ కన్‌స్ట్రక్షన్స్’ అధినేత కావూరు సాంబశివరావు (82) కన్నుమూశారు. ఇటీవల బ్రెయిన్ స్ర్టోక్ రాగా ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు....
అనారోగ్యంతో సాంబశివరావు కన్నుమూత
నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు
ఏలూరు/విజయవాడ/హైదరాబాద్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): కేంద్ర మాజీ మంత్రి, ‘ప్రోగెస్రివ్ కన్‌స్ట్రక్షన్స్’ అధినేత కావూరు సాంబశివరావు (82) కన్నుమూశారు. ఇటీవల బ్రెయిన్ స్ర్టోక్ రాగా ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి 11.10 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య హేమలత, కుమారుడు భాస్కర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రైతు కుటుంబంలో పుట్టి పారిశ్రామికవేత్తగా ఎదిగిన సాంబశివరావు.. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడులో 1943 అక్టోబరు 2న కావూరు జన్మించారు. తండ్రి రాఘవయ్య.. తల్లి నాగరత్నమ్మ. ఆయనకు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. వరంగల్ ఆర్‌ఈసీలో 1965లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ ఏడాది జూన్ 17న మాజీ ఎంపీ మాగంటి అంకినీడు సోదరి హేమలతను వివాహమాడారు. మరుసటి ఏడాదే ప్రోగెస్రివ్ కన్‌స్ట్రక్షన్స్ అనే కాంట్రాక్టు సంస్థను స్థాపించారు. కాంగ్రె్‌సలో చేరిన సాంబశివరావు.. రాజకీయ దిగ్గజంగా పేరుగాంచారు. 1984, 89, 98 ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఏలూరు లోక్‌సభ స్థానానికి మారి.. వరుసగా 2004, 09 ఎన్నికల్లో విజయం సాధించారు. మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో 2013 నుంచి 2014 వరకు కేంద్ర జౌళి మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ 2014 ఏప్రిల్ 28న పార్టీకి, కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు భాస్కర్ కాంట్రాక్టరు కాగా.. పెద్ద కుమార్తె శ్రీనగి డాక్టర్. రెండో కుమార్తె శ్రీమణి.. విశాఖ ఎంపీ శ్రీభరత్ తల్లి. ఈయన సినీ హీరో నందమూరి బాలకృష్ణకు చిన్నల్లుడు.. మంత్రి లోకేశ్‌కు తోడల్లుడు. మూడో కుమార్తె శ్రీవాణి తణుకులో స్థిరపడ్డారు.
'కృష్ణా’లో పుట్టి దేశ రాజకీయాలకు..
సాంబశివరావుకు సొంత కృష్ణా జిల్లాతో మంచి అనుబంధం ఉంది. విద్యార్థి దశలో కమ్యూనిజంవైపు ఆకర్షితులైనా.. ఇంజనీరింగ్ విద్య తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగారు. నిర్మాణ రంగం, భారీ వ ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టి పట్టుదలతో ఒక్కో మెట్టూ ఎదిగారు. దేశ రాజకీయాలకూ వెళ్లారు. మచిలీపట్నం, ఏలూరు ఎంపీగా ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి కృషిచేశారు.కొల్లేరు ప్రజల హక్కుల కోసం పోరాడారు. సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న గన్‌బజార్, వట్లూరుల్లోని రైల్వేఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ఆయన హయాంలోనే పూర్తయింది. ఏలూరులో జనశిక్షణ సంస్థాన్ ద్వారా మగ్గం, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ కోర్సుల్లో వేల మంది మహిళలకు శిక్షణ ఇప్పించారు. నిరుద్యోగ యువతకు డ్రైవింగ్, కంప్యూటర్ హార్డ్డ్‌వేర్‌లో శిక్షణను ఇటీవలి వరకు కొనసాగించారు. ఎంపీగా పలు శాఖల పార్లమెంటరీ కమిటీలు, సలహా సంఘాల సభ్యుడిగా కొనసాగారు. 15వ లోక్‌సభ ప్రజా పద్దుల కమిటీ సభ్యుడిగా పని చేశారు. కాంగ్రె్‌సలో ఎన్నో క్రియాశీల పదవులు నిర్వహించారు. 1985లో ఏఐసీసీ సహ కార్యదర్శిగా.. 1989లో ఉమ్మడి రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, 1998లో పీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. పొగాకు బోర్డు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆంధ్రాబ్యాంక్, సాలార్‌జంగ్ మ్యూజియం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, అఖిల భారత సాంకేతిక విద్యామండలి వంటి జాతీయ సంస్థల కమిటీల్లో సభ్యుడిగా వ్యవహరించారు. కావూరు మృతికి వివిధ పార్టీల నేతలు, ప్రముఖలు సంతాపం ప్రకటించారు.

రాజకీయ, వ్యాపార రంగాల్లో కావూరుది ప్రత్యేక ముద్ర: చంద్రబాబు
సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతికి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేసిన సాంబశివరావు మరణం తీరని లోటు అన్నారు. రాజకీయ, వ్యాపార రంగాల్లో కావూరుది ప్రత్యేక ముద్ర అన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాంబశివరావు మృతికి మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు. ‘రాజకీయ కురువృద్ధులు, మా బంధువు సాంబశివరావు సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
కావూరు మృతికి జస్టిస్ బట్టుదేవానంద్ సంతాపం
కావూరు మృతి పట్ల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రాజకీయాల్లో సమున్నత విలువలు పాటించిన ఆయన జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికవ్వడమే కాకుండా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారన్నారు. 43 ఏళ్ల రాజకీయ జీవితంలో పేద, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. కావూరు కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.