కాసుల ‘ప్లాన్’!
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:52 AM
కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల ప్లానింగ్ విభాగంపై పెత్తనం కోసం టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) దొడ్డిదారిన అడుగులు వేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. లే అవుట్లకు సంబంధించి కీలక సవరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. పాతిక ఎకరాలపైన లే అవుట్‌కు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా డీటీసీపీ అనుమతి తీసుకొనేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. కార్పొరేషన్, పట్టణాభివృద్ధి సంస్థలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అక్కడి నుంచి వివిధ దశల్లో స్కూట్నీ పూర్తయి.. అనుమతి ఇచ్చాక కూడా డీటీసీపీకి పంపాలని తెరపైకి తెస్తోంది. డీటీసీపీ మాత్రమే ఫైనల్ అప్రూవల్ ఇవ్వాలన్నట్టు చక్రం తిప్పుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) తీరుపై సర్వత్రా విమర్శలు
- కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలపై పెత్తనం కోసం పాకులాట
- పాతిక ఎకరాలపైన లే అవుట్‌కు అనుమతులు ఇక డీటీసీపీ చేతుల్లోకి ..
- దొడ్డిదారిలో అధికారాలు దక్కించుకునేందుకు కుట్ర
- ఐఏఎస్‌లను కాదని.. డైరెక్టర్‌కు అధికారాలా!
కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల ప్లానింగ్ విభాగంపై పెత్తనం కోసం టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) దొడ్డిదారిన అడుగులు వేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. లే అవుట్లకు సంబంధించి కీలక సవరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. పాతిక ఎకరాలపైన లే అవుట్‌కు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా డీటీసీపీ అనుమతి తీసుకొనేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. కార్పొరేషన్, పట్టణాభివృద్ధి సంస్థలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అక్కడి నుంచి వివిధ దశల్లో స్కూట్నీ పూర్తయి.. అనుమతి ఇచ్చాక కూడా డీటీసీపీకి పంపాలని తెరపైకి తెస్తోంది. డీటీసీపీ మాత్రమే ఫైనల్ అప్రూవల్ ఇవ్వాలన్నట్టు చక్రం తిప్పుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల అఽధికారాలను కూడా తన చెప్పు చేతల్లోకి తీసుకునేందుకు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) తెరవెనుక చక్రం తిప్పుతోందని ఆరోపణలు వస్తున్నాయి. లే అవుట్లకు అనుమతులు ఇచ్చే విషయంలో కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిని పరిమితం చేసేలా దొడ్డిదోవన కొన్ని ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చింది. ఈ ప్రతిపాదనలను అన్ని పట్టణాభివృద్ధి సంస్థలు, ప్రధానంగా సీఆర్‌డీఏ, గ్రేటర్ కార్పొరేషన్లు, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగరపంచాయతీలకు పంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనల సమాచారం ‘ఆంధ్రజ్యోతి’కి చిక్కింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీఆర్‌డీఏ, విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్ల అధికారాలను అవమానపరిచేదిగానూ, అధికారాలను కుదించేదిగానూ డీటీసీపీ ప్రతిపాదనలు ఉన్నాయి. పాతిక ఎకరాలకు పైగా లే అవుట్‌కు అనుమతులు ఇవ్వాలంటే .. ఇప్పటి వరకు కార్పొరేషన్లు, సీఆర్‌డీఏ పరిధిలో స్థానికంగానే ఇచ్చేవి. లే అవుట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సీఆర్‌డీఏ పరిధిలో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్, జోనల్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, జోనల్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్, జోనల్ ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్‌లను దాటుకుని ఫైల్ ముందుకు వెళ్లాలి. అంతిమంగా అడిషనల్ కమిషనర్ ఆ తర్వాత కమిషనర్‌కు వెళ్లాలి. ఐదు దశలను దాటిన తర్వాత ఐఏఎస్‌ల దగ్గరకు వెళుతుంది. సీఆర్‌డీఏలో మొత్తం ఏడు వ్యవస్థలను దాటిన తర్వాత అనుమతులు వస్తాయి. ఈ మధ్యలో ఎవరి దగ్గర కొర్రీ పడినా జాప్యం జరుగుతుంది. స్థానికంగా అయితే దరఖాస్తుదారులు తిరిగి ఆ కొర్రీలేమిటో పరిష్కరించుకోవడటానికి అవకాశం ఉంటుంది. డీటీసీపీ తాజా ప్రతిపాదనల వల్ల కార్పొరేషన్లు, సీఆర్‌డీఏ కాదని.. ఫైనల్ ప్లాన్ కోసం డీటీసీపీకి వెళుతుంది. డీటీసీపీ దగ్గర కూడా ఇదే విధంగా మరికొన్ని దశలు ఉంటాయి. ఈ దశలన్నీ దాటుకుని డైరెక్టర్ దగ్గరకు వెళ్లాలి. అప్పుడు డైరెక్టర్ అప్రూల్ ఇస్తారు.
దరఖాస్తుదారులకు మరింత ఇబ్బంది!
ఈ నిర్ణయం వల్ల దరఖాస్తుదారులు డీటీసీపీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కింది స్థాయిలో ఎవరైనా ఏ కారణంతోనైనా కొర్రీ వేస్తే.. మళ్లీ మొదటకు వస్తుంది. ఆ కొర్రీని నివృత్తి చేసుకోవటానికి మళ్లీ టీడీసీపీ కార్యాలయానికి వెళ్లాలి. ఇలా దరఖాస్తుదారుడు కార్పొరేషన్, సీఆర్‌డీఏ, టీడీసీపీల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఒక వైపు ప్రభుత్వం ప్లాన్ల అనుమతులను సరళీకరణ చేయాలని చెబుతోంది. ఆ దిశగా ఆన్‌లైన్ వ్యవస్థను తీసుకురావటం జరిగింది. ఇంకా జఠిలంగా మారేలా డీటీసీపీ విధానం కనిపిస్తోంది.
కమిషనర్లు ఉండగా.. డైరెక్టర్ దగ్గరకు ఫైల్ ఎందుకు?
మునిసిపల్ కార్పొరేషన్లలో ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా ఉన్నారు. సీఆర్‌డీఏలో అయితే అడిషనల్ కమిషనర్, కమిషనర్‌లు ఇద్దరూ కూడా ఐఏఎస్ అధికారులే కావటం గమనార్హం. ఐఏఎస్ అధికారులు అంటే టీడీసీపీ డైరెక్టర్ కంటే కూడా పెద్ద స్థాయి. ఐఏఎస్‌ల నుంచి డైరెక్టర్‌కు రావడం అంటే.. వారిని అవమానపరిచినట్టే అవుతుంది. డీటీసీపీ ఎందుకిలా చేయాలనుకుంటుందో అంతుచిక్కడం లేదు.
కాసుల కోసమే .. ప్రతిపాదనలా!
డీటీసీపీ తీసుకురావాలనుకుంటున్న విధానంపై తీవ్ర విమర్శలే కాకుండా .. అంతకు మించి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే డీటీసీపీలో పైసలు ఇవ్వనిదే పనులు కావన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్ల మీద, పట్టణాభివృద్ధి సంస్థల మీద అధికారం చెలాయించడం మామూళ్లు దండుకోవడానికేనన్న విమర్శలు వస్తున్నాయి.