వీఆర్‌కు కాశీబుగ్గ సీఐ
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:10 AM
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి వ్యవహారంలో.. మరో పోలీసు అధికారిపై వేటు పడింది. ఇప్పటికే సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే.
‘సీదిరి’ వ్యవహారంలో మరో పోలీసు అధికారిపై వేటు
జైల్లో కుమారుడిని కలిసిన అప్పలరాజు దంపతులు
శ్రీకాకుళం, జూలై 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి వ్యవహారంలో.. మరో పోలీసు అధికారిపై వేటు పడింది. ఇప్పటికే సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. తాజాగా సీఐపై కూడా వేటు పడింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ నెల 10న వైసీపీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బుల్లెట్ నడుపుతూ దానయ్య అనే వ్యక్తిని ఢీకొట్టి అతని మరణానికి కారణమయ్యాడు. కొడుకును కాపాడుకునేందుకు అప్పలరాజు.. మరోవ్యక్తిని ఆ స్థానంలో రంగంలోకి దింపారు. సిద్ధార్థ త్యాడి అనే యువకుడిని పోలీసుల వద్దకు పంపి తానే యాక్సిడెంట్ చేశానంటూ లొంగిపోయేలా చేశారు. అలాగే, మృతుడి కుటుంబంతోనూ కొంతమంది ద్వారా ఒప్పందం చేయించి.. వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేద్దామనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయింది. ప్రమాదానికి అసలు కారణం ఆరవ్‌వర్మ అని, సంబంధం లేని సిద్ధార్థ త్యాడిని పోలీసులకు లొంగిపోయేలా చేశారని, అప్పలరాజు వెనకుండి ఇదంతా నడిపించారని బయటపడింది. దీంతో పోలీసులు... కఠినసెక్షన్లు మోపి ముగ్గురిపైనా కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆరవ్‌వర్మ, సిద్ధార్థ త్యాడి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక అప్పలరాజు అరెస్ట్ మిగిలి ఉంది.
మరోవైపు విచారణ జరపకుండా సిద్ధార్థ త్యాడిపై కేసు నమోదుచేసి మమ అనిపించేసిన కాశీబుగ్గ పోలీసులపై వరుసగా వేట్లు పడుతున్నాయి. ఈ నెల 17న కాశీబుగ్గ ఎస్‌ఐ ఎం.సునీల్‌ను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణనూ వీఆర్‌కు పంపుతూ విశాఖ ఐజీ గోపీనాథ్ జెట్టీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఎస్‌ఐ, సీఐలపై వేటు పడేందుకు అప్పలరాజు కారణమయ్యారని చర్చ జిల్లా పోలీసు శాఖలో జరుగుతోంది. కాగా, సోంపేట కోర్టు ఆదేశాల మేరకు జైల్లో ఉన్న ఆరవ్‌వర్మకు ఆరోగ్యం ఎలా ఉన్నదీ పరిశీలించి పలాస ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ సోమవారం నివేదిక అందజేయనున్నారు. అదేరోజు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి.