మద్యం సరఫరా సంగతేంటి?
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:26 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌ను సిట్ అధికారులు గురువారం విచారించనున్నారు.
లిక్కర్ స్కామ్‌లో కారుమూరును నేడు ప్రశ్నించనున్న సిట్
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌ను సిట్ అధికారులు గురువారం విచారించనున్నారు. మద్యం సరఫరా టెండర్లు అధిక ధరలకు అక్రమంగా దక్కించుకుని ఆయాచిత లబ్ధి పొందారన్న ఆరోపణలపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే వారిపై కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా తండ్రీ, కొడుకులకు నోటీసులు ఇచ్చింది. ఈనెల 23న విజయవాడలోని సిట్ కార్యాలయంలో తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ దర్యాప్తు అధికారి ఇచ్చిన నోటీసుకు స్పందించిన కారుమూరు నాగేశ్వరరావు అనారోగ్య కారణాల వల్ల రాలేనని చెప్పారు. అయితే హైదరాబాద్‌కు వచ్చి విచారిస్తామని సిట్ అధికారులు చెప్పడంతో చేసేది లేక సరే అన్నారు. ఇదే కేసులో నిందితుడైన ఆయన కుమారుడిని విజయవాడలోనే ప్రశ్నించనున్నారు. ఇదిలాఉండగా మద్యం సరఫరా టెండర్లలో నాలుగో నిందితుడైన రాజ్ కసిరెడ్డిని ఈనెల 24న సిట్ ముందు విచారణకు హాజరు కావాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 19 నుంచి సిట్ నోటీసుల్ని పెడచెవినపెట్టిన కసిరెడ్డి ఎట్టకేలకు విచారణకు హాజరవ్వక తప్పడం లేదు.