మాజీ మంత్రి కారుమూరి అరెస్టు
ABN , Publish Date - Aug 24 , 2026 | 03:22 AM
జగన్ హయాంలో జరిగిన మద్యం రవాణా కాంట్రాక్టుల్లో అక్రమాలకు సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టుచేసింది.
జగన్ హయాంలో రూ.400 కోట్ల మద్యం రవాణా స్కాం
ఇందులో రూ.195 కోట్ల లావాదేవీలు గుర్తించిన ఈడీ
ఇప్పటికే చంచల్‌గూడ జైల్లో కారుమూరి కొడుకు సునీల్
దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి కూడా..
కారుమూరి కంపెనీ ఖాతాల్లోకి రూ.68 కోట్లు
మాజీ మంత్రి ఖాతాలకు రూ.15 కోట్లు
ఆయన కోడలు అకౌంట్లలో 9.5 కోట్లు గుర్తింపు
సునీల్‌కుమార్ ఖాతాలకూ నిధులు మళ్లింపు
మొత్తం రూ.37.7 కోట్ల ఆస్తులను
జప్తు చేసిన ఈడీ అధికారులు
ముందస్తు బెయిల్ కోసం నాగేశ్వరరావు ప్రయత్నాలు విఫలం
సుప్రీంకోర్టులోనూ లభించని ఊరట
హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఈడీ
గతంలో మద్యం రవాణా విధానం జిల్లాల జాయింట్ కలెక్టర్ల పరిధిలో ఉండేది. దీన్ని కేంద్రీకృతం చేసి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేసేలా గత జగన్ ప్రభుత్వంలో నిర్ణయించారు. తద్వారా భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. మద్యం కార్టన్(బాక్సు) రవాణా ధరను రూ.13 నుంచి ఏకంగా రూ.34కు పెంచేశారు. ఇలా మద్యం రవాణా స్కామ్‌లో రూ.400 కోట్లు దోపిడీ చేసినట్టు సిట్ తేల్చింది. ఇందులో కారుమూరి కుటుంబ సభ్యులకు రూ.90 కోట్లకు పైగా అందినట్టు ఈడీ గుర్తించింది.
హైదరాబాద్/అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన మద్యం రవాణా కాంట్రాక్టుల్లో అక్రమాలకు సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టుచేసింది. ఆదివారం హైదరాబాద్ కొండాపూర్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకుని బషీర్‌బాగ్‌లోని తమ ప్రధాన కార్యాలయానికి తరలించింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు సంబంధించిన మద్యం రవాణా టెండర్లలో రూ.400 కోట్ల మేర దోపిడీ జరిగిందని, అస్మదీయ సంస్థలకు ప్రయోజనం కలిగేలా నిబంధనలు మార్చి, సబ్‌కాంట్రాక్టుల ద్వారా భారీ మొత్తంలో అక్రమ లాభాలు పొందారని రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. ఇందులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రూ.195 కోట్ల లావాదేవీలను కనుగొన్నారు. ఈ ఏడాది జూన్ 18న కారుమూరి కుమారుడు సునీల్‌కుమార్‌ను అరెస్టుచేశారు. అంతకుముందే అదే నెల 11న బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, మద్యం స్కాం కేసులో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ జ్యుడీషియల్ రిమాండ్‌పై చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో గుర్తించిన రూ.37.7 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం కారుమూరి నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సుప్రీంకోర్టు నుంచి కూడా రక్షణ లభించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఆయన్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. జగన్ హయాంలో వైసీపీ నేతలు మద్యం సరఫరా కాంట్రాక్టును జిల్లాలు, ప్రాంతాల వారీగా దక్కించుకుని భారీ దోపిడీకి తెరతీశారు. జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి ‘సిగ్మా సప్లయ్ చైన్ సొల్యూషన్స్’ పేరుతో ముసుగు సంస్థను హడావుడిగా నెలకొల్పి దానికి ప్రధాన కాంట్రాక్టు దక్కేలా నిబంధనలు మార్చారు. మద్యం రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 96 శాతం నిధులు లిక్కర్ సిండికేట్ ఖాతాల్లోకి వెళ్లగా.. సిగ్మా కేవలం 4 శాతమే తీసుకుంది. ఆ 96 శాతం నిధుల నుంచి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన శ్రీ సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ ఖాతాల్లోకి రూ.68 కోట్లు, మాజీ మంత్రికి నగదు, బ్యాంకు ఖాతాల ద్వారా రూ.15 కోట్లు, ఆయన కోడలు కీర్తి బ్యాంకు ఖాతాల్లోకి రూ.9.5 కోట్లు, కుమారుడు సునీల్ ఖాతాల్లోకి సైతం నిధులు చేరినట్లు ఈడీ గుర్తించింది. సునీల్‌ను అరెస్టు చేసి.. జూన్ 24న విచారణకు రావాలని నాగేశ్వరరావుకు నోటీసు ఇచ్చింది. అయితే అనారోగ్య కారణాలు చూపి గైర్హాజరైన ఆయన.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా.. ఊరట లభించలేదు. కొన్ని రోజులుగా నిఘా పెట్టిన ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
మద్యం రవాణాలో అసలేం జరిగింది..?
రూ.3500 కోట్ల మద్యం కుంభకోణం జరిగిన జగన్ పాలనలో మరో రూ.400 కోట్ల మద్యం రవాణా స్కాం కూడా బయటపడింది. ఆయన అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో మద్యం డిపో నుంచి షాపునకు ఒక కార్టన్ (బాక్సు) సరఫరా చేస్తే.. రవాణాచేసిన వారికి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ రూ.13 చొప్పున చెల్లించేది. అయితే జగన్ ప్రభుత్వం.. మద్యం కార్టన్ రవాణా ధరను రూ.13 నుంచి అనూహ్యంగా రూ.34కి పెంచేసి దోపిడీకి దారులు వేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక.. రాజ్ కసిరెడ్డి, ఆయన కేబినెట్లో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కేంద్ర సర్వీసుల నుంచి కోరి తెచ్చుకున్న వాసుదేవరెడ్డి సహా మరికొందరి పాత్రపై విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ జరిపి.. మద్యం రవాణాలో దోపిడీ గుట్టును రట్టు చేసింది. ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరిన్ని ఆధారాలు వెలికితీసింది. అనంతరం కేంద్ర ఏజెన్సీ అయిన ఈడీ రంగంలోకి దిగింది. సిట్ నుంచి వివరాలు తీసుకుని ఈసీఐఆర్ నమోదుచేసి మరింత లోతుగా ఆరా తీసింది. ఇందులో మనీలాండరింగ్ కోణాన్ని పసిగట్టి ఆ దిశగా దర్యాప్తు చేపట్టింది. వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఆనాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వారి బంధుగణం కలిసి 400 కోట్ల వరకూ ఖజానాకు నష్టం చేకూర్చినట్లు సిట్ విచారణలో తేలగా.. ఇందులో రూ.195.32 కోట్ల లావాదేవీలను ఈడీ బహిర్గతం చేసింది. ఈ క్రమంలోనే వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, సునీల్‌కుమార్‌ను అరెస్టుచేసింది.
రూ.13 నుంచి 34కి..
రాజ్ కసిరెడ్డికి నమ్మిన బంటు తుకేకుల ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్యం రవాణా కాంట్రాక్టును ఇప్పించే ఉద్దేశంతో.. జిల్లాల జాయింట్ కలెక్టర్ల పరిధిలో ఉన్న మద్యం రవాణా విధానాన్ని కేంద్రీకృతం చేసి.. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేస్తే బాగుంటుందని భావించారు. ప్రభుత్వ పెద్దలు వెంటనే సమ్మతించడంతో మద్యం రవాణాను కేంద్రీకృతం చేసి కార్టన్ రవాణా ధరను రూ.13 నుంచి అనూహ్యంగా 34 రూపాయలకు పెంచేశారు. ఈశ్వర్‌కుమార్‌రెడ్డి, కిరణ్, రాజ్ కసిరెడ్డి కలిసి ‘సిగ్మా సప్లయ్ చైన్ సొల్యూషన్స్‘ అనే సంస్థను ఆగమేఘాలపై ఏర్పాటు చేశారు. మద్యం రవాణా కాంట్రాక్టు దీనికి దక్కింది. రాజ్ కసిరెడ్డి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టులు సైతం ఇచ్చారు. అందులో భాగంగా అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన శ్రీ సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ సంస్థకు మధ్య కోస్తా ప్రాంతాన్ని అప్పగించారు. ఈ వ్యవహారంలో సిగ్మా సప్లయ్ చైన్ సొల్యూషన్స్‌ను తెరముందు పెట్టి ఆపై ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్, సుదర్శన్ ట్రాన్స్‌పోర్ట్ తదితర కంపెనీల పేరిట రవాణా దందా సాగించారు. స్థానిక ట్రాన్‌పోర్టర్లతో రవాణా చేయించి.. వారికి కార్టన్‌కు చాలా తక్కువ చెల్లించి.. మిగతాదంతా జేబులో వేసుకున్నట్లు తేలింది. దరిదాపుగా రూ.400 కోట్లు స్వాహాచేసినట్లు సిట్ తేల్చింది. తదనంతరం ఈడీ రంగ ప్రవేశం చేసింది. లోతుగా దర్యాప్తు చేసి ఈ ఏడాది జూన్ 11న వాసుదేవరెడ్డి, రాజ్‌కసిరెడ్డిని, 18న సునీల్‌కుమార్‌ను అరెస్టుచేసింది.
మొత్తంగా ఈ వ్యవహారంలో రూ.195.32 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది. ఈ మొత్తం దందాకు కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి కాగా.. ఆయన చెప్పినట్లు వ్యవహరించిన వాసుదేవరెడ్డి, సునీల్‌కుమార్, నాగేశ్వరరావుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని.. ప్రధాన లాభం రాజ్ కసిరెడ్డి ద్వారా ఎటు వెళ్లింది.. ఎక్కడెక్కడ ఈ మొత్తాలను పెట్టుబడులుగా పెట్టారు.. మనీట్రయల్ ఏ విధంగా జరిగిందో విచారిస్తున్నామని ఈడీ అధికారులు వెల్లడించారు. సునీల్‌కుమార్ నివాసం, కార్యాలయాల్లో సోదాల సందర్భంగా లగ్జరీ వాహనాలు, ఖరీదైన చేతి గడియారాలు, కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీల్లో రూ.195.32 కోట్ల వరకూ అనుమానిత లావాదేవీలను గుర్తించింది. అక్రమంగా వచ్చిన నిధులను తమ ఖాతాల్లో ఉంచకుండా.. బోగస్ ఇన్వాయి్‌సలు, షెల్ సంస్థలు, నగదు రూపంలో సెక్యూరిటీ డిపాజిట్లు, భూముల కొనుగోలు అడ్వాన్సులు తదితర మార్గాల ద్వారా నిధులను లేయరింగ్ చేసినట్లు తేలింది. ఈ కేసులో ఇతర నిందితులుగా వాసుదేవరెడ్డి బావమరిది విజయ్‌నరసింహారెడ్డి, కారుమూరి కోడలు వల్లూరి కీర్తి, కసిరెడ్డి గ్యాంగ్‌లోని సైఫ్ అహ్మద్, బూనేటి చాణక్య ఉన్నారు.