Share News

కొల్లగొట్టినదంతా కారుమూరికే!

ABN , Publish Date - Aug 26 , 2026 | 04:50 AM

మద్యం రవాణా కుంభకోణం ద్వారా అక్రమంగా ఆర్జించిన సొమ్మంతా కేసులో కీలక నిందితుడైన వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికే చేరిందని ఈడీ స్పష్టంచేసింది. మంత్రిగా తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి..

కొల్లగొట్టినదంతా కారుమూరికే!

  • మద్యం రవాణా స్కాంలో రూ.11.95 కోట్లు ఆయన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకే: ఈడీ

  • రూ.18.09 కోట్ల మనీలాండరింగ్‌..

  • అక్రమార్జనతో లగ్జరీ కార్లు, ఖరీదైన వాచీలు, ఆస్తుల కొనుగోలు

  • విమాన ప్రయాణాలు కూడా..

  • రాజ్‌ కసిరెడ్డికి నెలనెలా 60 లక్షలు చెల్లింపు

  • రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా కుంభకోణం ద్వారా అక్రమంగా ఆర్జించిన సొమ్మంతా కేసులో కీలక నిందితుడైన వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికే చేరిందని ఈడీ స్పష్టంచేసింది. మంత్రిగా తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి.. అక్రమాలకు పాల్పడ్డారని, రవాణా కాంట్రాక్టుల ద్వారా వచ్చిన సొమ్మును తన కుటుంబసభ్యుల ఖాతాల్లోకి మళ్లించారని పేర్కొంది. ఈ కేసులో కారుమూరిని సోమవారం అరెస్టుచేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌పై చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టుకు ఈడీ సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు వెలుగుచూశాయి. కారుమూరి తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి.. మద్యం రవాణా సబ్‌ కాంట్రాక్టులను ఇప్పించారని.. తద్వారా వచ్చిన అక్రమ ఆదాయాన్ని తమ కుటుంబసభ్యుల ఖాతాల్లోకి మళ్లించారన్న ఆరోపణలకు సంబంధించి పలు ఆధారాలను ఈడీ అధికారులు కోర్టు ముందుంచారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో మాజీ మంత్రి, ఆయన కుమారుడు సునీల్‌కుమార్‌ రూ.18.09 కోట్లు నేరపూరిత ఆదాయాన్ని పొందినట్లు వెల్లడైందని.. ఈ డబ్బును బ్యాంకు బదిలీలు, నగదు లావాదేవీలు, స్థిర చరాస్తుల కొనుగోళ్లు, వ్యక్తిగత అవసరాలకు చెల్లింపుల రూపంలో వాడారనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. సుదర్శన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ బ్యాంకు ఖాతాల నుంచి రూ.11.95 కోట్లు కారుమూరి కుటుంబసభ్యుల ఖాతాల్లోకి బదిలీ అయినట్లు వెల్లడించారు. నేరపూరితంగా ఆర్జించిన ఆదాయంతో విలాసవంతమైన కార్లు, ఖరీదైన వాచీలు, స్ధిర చరాస్తులు కొన్నారు. విమాన ప్రయాణాలకు ఈ సొమ్మే వాడారు. ఇతరులకు రూ.3 కోట్లు చెల్లించారు. ఇవే కాకుండా కారుమూరి తనకు వచ్చిన ఆదాయం నుంచి ప్రతి నెలా రూ.50-60 లక్షల నగదును.. సుదర్శన్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన సందీప్‌ ద్వారా సిండికేట్‌లో కీలక పాత్రధారి రాజ్‌ కసిరెడ్డికి చెల్లించినట్లు దర్యాప్తులో తేలింది’ అని ఈడీ తెలిపింది.


సిగ్మా.. ఫ్రంట్‌ ఆర్గనైజేషన్‌..

ఏపీ బేవరేజేస్‌ కార్పొరేషన్‌ నుంచి అధికరేట్లకు మద్యం రవాణా కాంట్రాక్టులు పొందేందుకు.. రాజ్‌ కసిరెడ్డి, ఈశ్వర్‌కుమార్‌రెడ్డి కలిసి ఏర్పాటుచేసిన ‘సిగ్మా సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్‌‘ సంస్థ ఫ్రంట్‌ ఆర్గనైజేషన్‌గా పనిచేసింది. వాస్తవ రవాణా పనులను సిగ్మా చేయలేదు. ఇతర సంస్ధలు, వ్యక్తులు ద్వారా చేయించి వచ్చిన డబ్బును వివిధ మార్గాల్లో మళ్లించారని, ఇందులో సుదర్శన్‌ కన్‌స్ట్రక్షన్‌ సైతం డమ్మీ సంస్థేనని రిమాండ్‌ రిపోర్టులో ఈడీ అధికారులు పేర్కొన్నారు. రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని తండ్రీకొడుకులు (కారుమూరి, సునీల్‌) తమకు నచ్చినవారికి రవాణా కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని తెలిపారు. సుదర్శన్‌ సంస్థను ముందుపెట్టి సిగ్మా ద్వారా వచ్చిన నిధులను కుటుంబ ఖాతాల్లోకి మళ్లించుకున్నారన్నారు.


కారుమూరి సునీల్‌ కస్టడీ పిటిషన్‌ డిస్మిస్‌

విజయవాడ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా టెండర్లలో జరిగిన అక్రమాలపై నమోదైన కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్‌ను కస్టడీకి ఇవ్వాలని సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు మంగళవారం డిస్మిస్‌ చేసింది. ఈ కేసులో సునీల్‌కుమార్‌ ఎనిమిదో నిందితుడిగా ఉన్నారు. అతన్ని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు వారం రోజుల క్రితం పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని మంగళవారం విచారించిన న్యాయాధికారి ఎల్‌.తేజోవతి ఈ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Aug 26 , 2026 | 04:52 AM