కస్సుబుస్సు కార్తికేయ!
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:23 AM
ఒక జిల్లా కలెక్టర్, ఎస్పీలపై ఆయన కస్సుబుస్సులాడారు. అంతేకాదు... ‘ఎలాంటి బూట్లు వేసుకోవాలో తెలియదు’ అని చిన్నబుచ్చడంతోపాటు కలెక్టర్‌కు కొరియర్‌లో షూస్ పంపి మళ్లీ అవమానించారు.
తీరు మార్చుకోని సీఎం కార్యదర్శి మిశ్రా
ఈసారి కృష్ణా కలెక్టర్, ఎస్పీలపైనే చిందులు
తమాషాగా ఉందా, సరిగ్గా నిలబడు అంటూ వీరంగం
అందరూ చూస్తుండగానే అనుచిత ప్రవర్తన
కలెక్టర్‌కు కొరియర్‌లో షూస్ పంపి అవమానం
మిశ్రా తీరుపై అధికార యంత్రాంగం గరంగరం
ఆది నుంచీ ఆయనది వివాదాస్పద ప్రవర్తనే
కిందిస్థాయి సిబ్బంది, మరీ ముఖ్యంగా తెలుగు అధికారులపై చిన్నచూపు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఏంటి నవ్వుతున్నావ్... తమాషాగా ఉందా?
సరిగ్గా నిల్చో! నోరు లేస్తోందేం! తమాషాలు చేయకు!
ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి... మరో ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్‌ను అన్న మాటలివి! ఇతర అధికారులంతా చూస్తుండగా... ఒక జిల్లా కలెక్టర్, ఎస్పీలపై ఆయన కస్సుబుస్సులాడారు. అంతేకాదు... ‘ఎలాంటి బూట్లు వేసుకోవాలో తెలియదు’ అని చిన్నబుచ్చడంతోపాటు కలెక్టర్‌కు కొరియర్‌లో షూస్ పంపి మళ్లీ అవమానించారు. ఇంతగా చెలరేగిపోయిన ఆ ఐఏఎస్ అధికారి పేరు... కార్తికేయ మిశ్రా! ఆయన ముఖ్యమంత్రి కార్యదర్శి! ఇప్పుడే కాదు... సర్వీసులో చేరినప్పటి నుంచీ కార్తికేయ మిశ్రాది అదే తీరు! కిందిస్థాయి సిబ్బందిని నోటికొచ్చినట్లు దూషిస్తారనే పేరు! ఇటీవల నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితోనూ లడాయి పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా అఖిల భారత సర్వీసు అధికారులపైనే నోరుపారేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలేం జరిగిందంటే...

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్ర పర్యటన ముగిసిన ఆదివారం ఆయనకు ప్రభుత్వ యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికింది. సీజేఐ వెళ్లిపోయిన తర్వాత అధికారులంతా గన్నవరం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఉండగా అక్కడికి సీఎం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ కార్తికేయ మిశ్రా వచ్చారు. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీని పిలిచి... ‘ఆ టై కట్టుకోవడమేమిటి? కోటు అలాగేనా వేసుకునేది? సరైన షూ ఎందుకు వేసుకోలేదు’ అంటూ పెద్ద గొంతుతో అరవడం మొదలుపెట్టారు. లేస్ ఉన్న షూస్ వేసుకోలేదంటూ మండిపడ్డారు. అనూహ్య ఘటనతో బాలాజీ ఒక్కసారిగా విస్తుపోయారు. ‘అదేం లేదు సార్, ఓకే సార్’ అంటూ నవ్వుతూ సర్దుకుపోయే ప్రయత్నం చేశారు. ‘ఏం నవ్వుతున్నావ్? తమాషాగా ఉందా?’ అంటూ మరింత గా మిశ్రా రెచ్చిపోయారు. ఆగకుండా ఐదారు నిమిషాల పాటు అందరూ వినేలా నోటికి పని చెప్పారు. అంతటితో శాంతించకుండా పక్కనే ఉన్న కృష్ణా ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని కూడా పిలిచారు. ఆయన తన దగ్గరికి వచ్చాక... ‘సీదా ఖడో’ (సరిగ్గా నిల్చో) అంటూ హుకుం జారీ చేశారు. ‘సర్, నేను సరిగ్గానే ఉన్నాను’ అని అంటుండగా ‘ఏమిటి నోరు లేస్తోంది? తమాషాలు చేయకు’ అంటూ హిందీలో కస్సుమన్నారు. కార్తికేయ మిశ్రా వీరంగం చూస్తున్న ఇతర అధికారులంతా బిత్తరపోయి నిల్చున్నారు.
తనకు సంబంధం లేకున్నా...
భారత ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం, వీడ్కోలు పలకడానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ విధిగా రావాలి. ఇది ప్రొటోకాల్! అలాగే కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఒకవేళ వారు ప్రొటోకాల్ ప్రకారం వ్యవహరించక పోయి ఉంటే... సంబంధిత అధికారులే స్పందించాలి. సీఎం కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు దీంతో ఎలాంటి సంబంధంలేదు. అయినప్పటికీ... ఆయన అతిగా స్పందించడం గమనార్హం.
ఆది నుంచీ ఇదే తంతు
కార్తికేయ మిశ్రా వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదమే. కొందిస్థాయి సిబ్బందిపై లెక్కలేకుండా మాట్లాడతారని, తెలుగు అధికారులంటే మరింత చిన్నచూపని, ‘మీకు ఇంగ్లిషు రాదు. ఏమీ తెలియదు’ అని చులకనగా చూస్తారని ఆయనపై ఆరోపణలున్నాయి. మిశ్రా వ్యవహార శైలిపై ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో పశ్చిమ గోదావరి కలెక్టర్‌గా ఉండగా టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఒక తహసీల్దార్‌ను ‘ఏంట్రా నీ పేరు? యూజ్‌లెస్ ఫెలో, బ్లడీ జోకర్’ అని తిట్టిపోశారు. ఈ విషయం రచ్చకెక్కడంతో నాటి ప్రభుత్వం ఆయనను కలెక్టర్‌గా తప్పించి కార్మికశాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. అక్కడి నుంచి ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. తర్వాత మళ్లీ రాష్ట్రానికి వచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు నంద్యాల ఎంపీ శబరితోనూ గొడవ పెట్టుకున్నారు. సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నించిన శబరిని అడ్డుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారి సీఎం దాకా వెళ్లింది. ఆ తర్వాతైనా మిశ్రా మారతారనుకుంటే... తాజాగా తోటి అఖిల భారత సర్వీసు అధికారులపైనే విరుచుకుపడుతూ, ‘నేనింతే’ అని నిరూపించుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కొరియర్‌లో షూ పంపి...
కృష్ణా కలెక్టర్ బాలాజీ ఆదివారం దాదాపు రోజంతా భారత ప్రధాన న్యాయమూర్తితో ఉన్నారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా ఎక్కడైనా షూ విప్పి, మళ్లీ వేసుకోవాల్సి వస్తే... ఆలస్యం కాకుండా ఉండేందుకు లేస్ ఉన్నవి కాకుండా, మామూలు బూట్లు వేసుకున్నారు. కార్తికేయ మిశ్రా ఆగ్రహానికి అదే కారణమైంది. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో కస్సుబుస్సుమన్న ఆయన అంతటితో ఊరుకోకుండా... కలెక్టర్‌కు కొరియర్‌లో లేస్ ఉన్న బూట్లు పంపినట్లు తెలిసింది. ఇది దురహంకారపూరితమని, సాటి ఐఏఎ్‌సను అవమానించడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.