Share News

పిన్నెల్లి అనుచరుడు కర్నాటి అరెస్టు

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:47 AM

హైకోర్టు అడ్వకేట్‌ కిడ్నాప్‌ కేసులో రెండున్నరేళ్లుగా పరారీలో ఉన్న కర్నాటి వీరభద్రరావు(ఏ1)ను విజయవాడ పటమట పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

పిన్నెల్లి అనుచరుడు కర్నాటి అరెస్టు

  • హైకోర్టు అడ్వకేట్‌ కిడ్నాప్‌ కేసులో వీరభద్రరావు ఏ1

గుణదల, మార్చి 12(ఆంధ్రజ్యోతి): హైకోర్టు అడ్వకేట్‌ కిడ్నాప్‌ కేసులో రెండున్నరేళ్లుగా పరారీలో ఉన్న కర్నాటి వీరభద్రరావు(ఏ1)ను విజయవాడ పటమట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 2023 నవంబరు 7న హైకోర్టు అడ్వకేట్‌ హరిబాబును వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు కర్నాటి వీరభద్రరావు, కర్నాటి సతీష్‌ నిర్బంధించి, హింసించారు. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న హరిబాబు తనపై దొంగ కేసు పెట్టి కిడ్నాప్‌ చేసి, చంపుతామని బెదిరించి ఆస్తులు రాయించుకున్నట్లు కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయాధికారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పిడుగురాళ్ళ పోలీసులు వీరికి సహకరించిన డీఎస్పీ పల్లంరాజు, ఎస్సై రబ్బానీల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. అప్పటి నుంచి పల్లంరాజు, రబ్బానీ సెస్పెన్షన్‌లో ఉన్నారు. అయితే ఈ కేసు విచారణలో పిడుగురాళ్ళ పోలీసులపై తనకు నమ్మకం లేదని హరిబాబు కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో కేసును పటమట పోలీస్‌ స్టేషన్‌కు కేసును బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లోనే పల్లంరాజు, రబ్బానీని కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.


కేసు నేపథ్యం ఇదీ..

విజయవాడలో నివాసం ఉంటున్న హైకోర్డు అడ్వకేట్‌ హరిబాబుకు అమెరికాలో ఉంటున్న కర్నాటి సతీ్‌షతో పరిచయం ఉంది. సతీష్‌ తండ్రి కర్నాటి వీరభద్రరావు గుంటూరు జిల్లా కోసూరు మండలం అందుకూరులో నివాసం ఉంటున్నారు. హరిబాబు నుంచి ఆయన రూ 2.40 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అందులో 2018, 2019 ఏప్రిల్‌లో రెండు విడతలుగా రూ 1.40 కోట్లు తిరిగి ఇచ్చేశారు. మిగిలిన మొత్తం త్వరలో ఇస్తామని స్టాంపు పేపర్‌ రాసి ఇచ్చారు. తర్వాత ఎంతకీ డబ్బులు ఇవ్వకపోగా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి హరిబాబుపై పిడుగురాళ్ళ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చే యించారు. అప్పటి గురజాల డీఎస్పీ పల్లంరాజు ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకుని కథ మొత్తం నడిపించారు. హరిబాబుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సెటిల్మెంట్‌ చేసేశారు. హరిబాబును బెదిరించి ఆస్తులను బలవంతంగా వీరభద్రరావుకు రిజిస్ట్రేషన్‌ చేయించారు.

Updated Date - Mar 13 , 2026 | 04:49 AM