తమ బస్సుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:52 AM
తమ బస్సుకు సైడ్ ఇవ్వలేదన్న అక్కసుతో కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సు డ్రైవర్.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దౌర్జన్యానికి దిగాడు.
శ్రీశైలంలో కేఎస్ ఆర్టీసీ డ్రైవర్ దౌర్జన్యం
ఓవర్‌టేక్ చేసి అడవి మఽధ్యలో బస్సు అడ్డగింత
ఏపీ డ్రైవర్‌ను వారి బస్సులో ఎక్కించి.. దోర్నాల వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లిన వైనం
పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
శ్రీశైలం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): తమ బస్సుకు సైడ్ ఇవ్వలేదన్న అక్కసుతో కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సు డ్రైవర్.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దౌర్జన్యానికి దిగాడు. ఆవేశంతో ఊగిపోతూ మరి కొందరు ప్రయాణికులతో కలిసి దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా వారి బస్సులోకి బలవంతంగా ఎక్కించి గంటకు పైగా బస్సును లాగిస్తూ, అలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ సంఘటన నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. ఆదివారం ఉదయం శ్రీశైలం శిఖరం వద్ద వరుసగా బస్సులు నిలిచాయి. ఆ బస్సుల క్రమాన్ని కాదని పక్క నుంచి వచ్చిన కేఎ్‌సఆర్టీసీ (కేఏ28 ఎఫ్ 2571) బస్సు రోడ్డు దిగడంతో టైర్ పంక్చర్ అయింది. ఇందుకు కారణం నువ్వేనంటూ.. అన్నమయ్య జిల్లా పీలేరు డిపోకు చెందిన (ఏపీ40జెడ్ 0616) కడప - తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాంద్ బాషాపై కర్ణాటక డ్రైవర్ సంగప్ప చలువారి గొడవకు దిగాడు. శిఖరం దాటి కొంత దూరం వెళ్లిన ఏపీ బస్సును మార్గ మధ్యలో ఓవర్‌టేక్ చేసి అడ్డగించాడు. పీలేరు డ్రైవర్ చాంద్‌బాషా బస్సు దిగి.. ఇదేమిటని అడగడానికి యత్నిస్తుండగా అతడిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దాడికి పాల్పడుతున్న డ్రైవర్, కండక్టర్లకు బస్సులోనే ఉన్న కొందరు కన్నడిగులు కూడా సహకరించారు. అందరూ కలసి డ్రైవర్ చాంద్‌బాషాను బలవంతంగా వారి బస్సులోకి ఎక్కించారు. దోర్నాల చేరే వరకు దారి పొడవునా సుమారు గంటకు పైగా ఇష్టానుసారంగా చితకబాదారు.
పీలేరు బస్సులో ఉన్న మరో సహ డ్రైవర్ చాకచక్యంగా కేఎ్‌సఆర్టీసీ బస్సును వెంబడించి దోర్నాల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గణేశ్ చెక్‌పోస్టు వద్ద కర్ణాటక బస్సును అడ్డగించి చాంద్‌బాషాను విడిపించారు. ఘటనకు కారణమైన కేఎ్‌సఆర్టీసీ బస్ డ్రైవర్, కండక్టర్లతో పాటు దాడికి పాల్పడిన ప్రయాణికులు విరూపాక్షయ్య, మల్లికార్జునను అదుపులోకి తీసుకుకున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు వారిని శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టినట్లు సీఐ జీవన్ గంగనాథ తెలిపారు.