Share News

కారంపూడి ఎస్‌ఐ సస్పెన్షన్‌

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:48 AM

‘నా మరణానికి ఎస్‌ఐ వాసు వేధింపులే కారణం’ అంటూ ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న వీడియో వైరల్‌ కావడంతో.. పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎస్‌ఐను సస్పెండ్‌ చేశారు.

కారంపూడి ఎస్‌ఐ సస్పెన్షన్‌

  • వేధిస్తున్నారంటూ వివాహిత ఆత్మహత్యాయత్నం

  • ఆమె వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

  • ఎస్‌ఐ వాసును సస్పెండ్‌ చేసిన అధికారులు

గుంటూరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ‘నా మరణానికి ఎస్‌ఐ వాసు వేధింపులే కారణం’ అంటూ ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న వీడియో వైరల్‌ కావడంతో.. పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎస్‌ఐను సస్పెండ్‌ చేశారు. పల్నాడు జిల్లా కారంపూడి ఎస్‌ఐ వాసు వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్టు చల్లా లక్ష్మి అనే వివాహిత వీడియోలో పేర్కొంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో కలకలం రేపింది. లక్ష్మి భర్త అయ్యప్ప కారంపూడి పరిసర ప్రాంత రైతుల నుంచి రూ.22 కోట్లు విలువ చేసే మిర్చి కొనుగోలు చేశారు. రైతులకు చాలావరకు సొమ్ము చెల్లించగా, ఇంకా కొందరు రైతులకు రూ.1.22 కోట్లు చెల్లించాలి. అయితే అయ్యప్ప నుంచి డబ్బులు రావని ఆందోళన చెందిన రైతులు.. ఆయనపై కారంపూడి పోలీస్‌ ేస్టషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో అయ్యప్ప దంపతులను పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ వాసు.. వారిని వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులపై ఈ నెల 2వ తేదీన అయ్యప్ప భార్య లక్ష్మి పురుగు మందు తాగుతూ వీడియో తీసింది. ఈవిషయమై పోలీసు ఉన్నత అధికారులు ప్రాథమిక విచారణ చేసి.. ఎస్‌ఐ వాసును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, ఎస్‌ఐ వాసు గతంలో నెల్లూరు, నాగార్జునసాగర్‌, రేపల్లె పోలీస్‌ స్టేషన్లలో పని చేసిన సమయంలోనూ వివాదాస్పదంగా వ్యవహరించినట్లు తెలిసింది. పలుమార్లు సస్పెండ్‌ అయ్యారని, ఆయనపై ఆరు చార్జిమెమోలు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 04:51 AM