ఏడు బస్సులు అగ్నికి ఆహుతి
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:07 AM
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని జేఆర్డీ టాటా పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేటు గ్యారేజీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఓ బస్సు ఏసీ కంప్రెషర్ నుంచి మంటలు
గాలితో ఇతర బస్సులకూ వ్యాపించిన వైనం
బెజవాడ సమీపంలోని కానూరు పారిశ్రామికవాడలో ఘటన
విజయవాడ, జూలై 12(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని జేఆర్డీ టాటా పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేటు గ్యారేజీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మరమ్మతుల కోసం వచ్చిన బస్సులో చెలరేగిన మంటలు చుట్టుపక్కల ఉన్న బస్సులకు వ్యాపించి మొత్తం ఏడు బస్సులు దగ్ధమయ్యాయి. శేఖర్ అనే వ్యక్తి పారిశ్రామికవాడ ఏడో రోడ్డులో అనూష గ్యారేజ్‌ను నిర్వహిస్తున్నాడు. ఇక్కడ ట్రావెల్ బస్సులకు బాడీబిల్డింగ్ చేయడంతోపాటు మరమ్మతులు చేస్తుంటాడు. మరమ్మతులు, ఆధునికీకరణ నిమిత్తం 13 బస్సులు ఈ షెడ్‌కు వచ్చాయి. ఆదివారం షెడ్‌కు సెలవు కావడంతో శేఖర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, షెడ్‌లోని కార్మికులతో కలిసి తెనాలి సమీపంలోని మోరంపూడి మహంకాళి ఆలయంలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్లారు.
ఫోను లైవ్ సీసీ ఫుటేజీలో మంటలను పసిగట్టిన యజమాని
ఆలయంలో పూజల అనంతరం షెడ్ వద్ద పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా తన ఫోన్‌లో శేఖర్ పరిశీలించారు. రిపేర్లు చేయడానికి ఏర్పాటు చేసిన రేకుల షెడ్ బయట ఉన్న ఏపీ39 వీడీ 8989 బస్సు పైభాగంలో ఏసీ కంప్రెషర్ నుంచి మంటలు రావడాన్ని ఆయన గమనించారు. వెంటనే మోరంపూడిలో బావమరిది సిద్ధార్థతో పాటు ఐదుగురు కార్మికులను కారులో కానూరుకు పంపారు. పక్క షెడ్‌లో ని కార్మికులకూ ఫోన్‌చేసి.. తన షెడ్‌లో ఉన్న బస్సులను వెంటనే బయటకు తీసుకురావాలని కోరారు. సిద్ధార్థ అక్కడి నుంచి బయలుదేరుతుండగానే అగ్నిమాపక శాఖ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. తాళాలు బస్సులకే ఉండటంతో పక్క షెడ్‌లో ఉన్నవారు ఆరు బస్సులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమయానికి గాలి విపరీతంగా వీయడంతో చుట్టుపక్కల ఉన్న బస్సులను మంటలు చుట్టేశాయి. ఐదు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో రెండు బస్సులకు పాక్షికంగా నష్టం వాటిల్లింది.
చిన్న రిపేరు కోసం వచ్చి బూడిద..
వాల్వో కంపెనీకి చెందిన అత్యాధునిక బస్సు చిన్న రిపేరు కోసం వచ్చి ప్రమాదంలో బూడిదైంది. ఓ వ్యక్తి రూ.70 లక్షలకు ఈ బస్సును కొన్నాడు. కొద్దిరోజుల క్రితం జరిగిన స్వల్ప ప్రమాదంలో బస్సుకు గీతలు పడ్డాయి. ఆ ప్రదేశంలో రంగులు వేయించడానికి యజమాని బస్సును షెడ్‌కు తీసుకొచ్చారు. ఈ పనులు పూర్తయ్యాయి. ఇక యజమాని వచ్చి బస్సును తీసుకెళ్లడమే తరువాయి. దీనికి ముందుగా ఉన్న బస్సు చాంబర్ పట్టేయడంతో.. ఈ బస్సును బయటకు తీసుకురావడం సాధ్యం కాలేదు. ఇంతలోనే మంటలు బస్సును చుట్టేయగా, పూర్తిగా దగ్ధమైపోయింది.