Share News

కొండా.. కోనా దాటి

ABN , Publish Date - Mar 14 , 2026 | 06:10 AM

శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవిని కన్నడిగులు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఏటా ఉగాది ఉత్సవాల్లో అమ్మవారికి వీరు పుట్టింటి సారె (పసుపు, కుంకుమ, గాజులు, వస్ర్తాలు, ఒడి బియ్యం) సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

కొండా.. కోనా దాటి

  • ఉగాదికి ముందుగానే శ్రీగిరికి భక్తుల తాకిడి

(ఆత్మకూరు-ఆంధ్రజ్యోతి)

శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవిని కన్నడిగులు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఏటా ఉగాది ఉత్సవాల్లో అమ్మవారికి వీరు పుట్టింటి సారె (పసుపు, కుంకుమ, గాజులు, వస్ర్తాలు, ఒడి బియ్యం) సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికోసం వేలసంఖ్యలో భక్తులు వందలాది కి.మీ.పాదయాత్ర చేస్తూ శక్తిపీఠానికి చేరుకుంటారు. కన్నడ భక్తులతో నల్లమల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వారు చేస్తున్న శివ నామస్మరణలతో ఆటవీ ప్రాంతం మార్మోగుతోంది. శతాబ్దాల నుంచి కొనసాగుతున్న ఆచారంలో భాగంగా ఉగాది పర్వదినానికి ముందే కన్నడిగులు శ్రీశైలానికి చేరుకొంటున్నారు.

శ్రీశైలంతో అనుబంధం

శివభక్తురాలైన భ్రమరాంబ కన్నడిగురాలు. కలలో కనిపించిన పరమేశ్వరుడిని వరించింది. శివుడు ఆమెకు ఓ భ్రమరాన్ని(తుమ్మెద) చూపించి అది నిలిచిన ప్రదేశానికి వస్తే తానే వరిస్తానని స్వప్నంలో చెప్పడంతో భ్రమరాంబా దేవి ఆ తుమ్మెదను అనుసరించింది. శ్రీశైలం వద్ద ఆగిన తుమ్మెద సమీపంలోనే ఆమె వచ్చి నిలబడింది. అదే సమయంలో వృద్ధుడి రూపంలో వచ్చిన పరమేశ్వరుడు తానే స్వప్నంలో కనిపించినట్లు చెప్పడంతో భ్రమరాంబ ఆయన్ను వివాహమాడింది. అందుకే నేటికీ శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునస్వామికి ప్రత్యేక ఆలయం ఉంది. భ్రమరాంబికా దేవిని మల్లికార్జున స్వామి వరించడంతో కన్నడిగులు అమ్మవారిని తమ ఆడపడుచుగా భావిస్తారు.

వందల కిలోమీటర్ల పాదయాత్ర

కర్ణాటకలోని బైచివాల్‌, కణ్ణల్ని, కూడ్లి, కెంపాలి, సోలాపూర్‌, బాగల్‌కోట, అత్తిని, బళ్లారి, గుల్బర్గ, హుబ్లి, సింధిని, కచునూర్‌, అరికెరి, రాయచూర్‌, వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ శ్రీశైలానికి వస్తుంటారు. ఉగాదికి 15నుంచి 30 రోజుల ముందుగానే తమ సొంత ప్రాంతాల నుంచి బయలుదేరతారు. కొంతమంది మొక్కు చెల్లించుకోవడంలో భాగంగా కాళ్లకు పొడవైన కర్రలు ధరించి పాదయాత్ర సాగిస్తారు. అటవీశాఖ ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది కన్నడిగులు ముందుగానే శ్రీశైలానికి చేరుకుంటున్నారు. దీంతో ఉగాదికి పది రోజుల ముందునుంచే క్షేత్రానికి భక్తుల తాకిడి మొదలైంది.


అడవిలో అక్షయపాత్ర

నాగలూటి వీరభద్రాలయం వద్ద శ్రీశైల మల్లికార్జున మల్టీపర్పస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్నదాన కేంద్రం కొనసాగుతోంది. ఇందులో సుమారు 250 మంది వలంటీర్లు అన్నదాన సేవలో భాగస్వాములయ్యారు. పాదయాత్రికుల సేవలో పాలుపంచుకోవడం ఎంతో ఫుణ్యమని వలంటీర్లు పేర్కొంటున్నారు. భారీ వంట పాత్రల్లో నిరంతరాయంగా ఆహార పదార్థాలు తయారుచేసి పాదయాత్రికులకు వడ్డిస్తున్నారు. గత 19ఏళ్లగా ఏటా అన్నదాన సేవలు చేపట్టి నిత్యం వేలాది మంది ఆకలి తీరుస్తున్నారు. ఈ సేవకు ఏడాదికి దాదాపు రూ.80 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో 20శాతం వరకూ విరాళాలుగా వస్తుండగా, మిగిలిన మొత్తాన్ని ట్రస్టు సభ్యులే సర్దుబాటు చేస్తున్నారు.

ఆత్మకూరు నుంచి శ్రీశైలానికి..

సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన నంద్యాల జిల్లా ఆత్మకూరుకు వచ్చే కన్నడిగులు అక్కడినుంచి వెంకటాపురం గ్రామానికి చేరుకొని, అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అటవీ మార్గంలో బైర్లూటి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శిస్తారు. తర్వాత నాగలూటి వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత 16 కి.మీ. దూరంలో ఉన్న పెచ్చెర్వు చెంచు గిరిజన గూడేనికి చేరతారు. అక్కడి నుంచి అడవిలో 18 కి.మీ. నడిచి భీమునికొలను, మరో 5 కి.మీ. దూరంలో హఠకేశ్వరం, ఆ తర్వాత 6 కి.మీ. దూరం పాదయాత్ర చేసి శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకుంటారు.

Untitled-5 copy.jpg


కోర్కెల కొండలో మొక్కులు

శ్రీశైలానికి చేరుకొనే అటవీ మార్గాన ఉన్న పెద్దచెరువు, భీముని కొలను మధ్యలో వెలసిన కోర్కెల కొండలో కన్నడిగులు తమ ఆచార సంప్రదాయలను నేటికి కొనసాగిస్తున్నారు. తమ మనసులోని కోర్కెలు నెరవేరాలంటూ అక్కడి వృక్షాలకు కాషాయరంగు వస్త్రంతో ఊయల కట్టి అందులో ఏదైనా వస్తువును ఉంచి నమస్కరిస్తారు. మరికొందరు సొంతింటి కలను నిజం చేసుకునేందుకు అక్కడ ఉన్న కొండరాళ్లను ఒకదానిపై ఒకటిగా అమర్చుతారు. మరికొందరు సంతానప్రాప్తి కోసం తమ మొక్కులను ఈ కొండపైనే తీర్చుకుంటారు. శ్రీగిరిపై ఈ ఆచారాన్ని మొదటిసారిగా కన్నడగులే ప్రారంభించారు.

Updated Date - Mar 14 , 2026 | 06:13 AM