కేజీ రోడ్డు మీదుగా కన్నడ భక్తులు
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:14 PM
నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యం పరిధిలో జరుగుతున్న అఖిల భారత పులుల లెక్కింపు ప్రక్రియ వల్ల శ్రీశైలానికి కన్నడ పాదయాత్రికులు కర్నూలు - గుంటూరు జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పులుల గణన వల్ల శ్రీశైల పాదయాత్రికుల ఇబ్బందులు
ఆత్మకూరు, జనవరి 14(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యం పరిధిలో జరుగుతున్న అఖిల భారత పులుల లెక్కింపు ప్రక్రియ వల్ల శ్రీశైలానికి కన్నడ పాదయాత్రికులు కర్నూలు - గుంటూరు జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనవరి 3న దేశవ్యాప్తంగా పులుల అభయారణ్యాల పరిధిలో పులుల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజుల జనవరి 3 నుంచి ఫిబ్రవరి 13వ తేది వరకు ట్రాప్స్ కెమెరాల ఆధారంగా పులుల లెక్కింపు ప్రక్రియను అటవీశాఖ అధికారులు చేపడుతున్నారు. దీని వల్ల మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్లే కన్నడ భక్తులను అటవీ మార్గంలో వెళ్లడానికి అటవీ అధికారులు అనుమతించ లేదు. దీంతో వారు కర్నూలు - గుంటూరు ప్రధాన రహదారి మీదుగా దోర్నాలకు చేరుకుని అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగానే శ్రీశైలానికి బయలుదేరారు.